RBI: ఈసారీ వడ్డీ రేట్లలో యథాతథ స్థితికే అవకాశం

by S Gopi |

గడిచిన ఏడాది కాలంగా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్‌బీఐ.. అందుకోసం రెపో రేటును ఏకంగా 1.25 శాతం తగ్గించింది.

RBI: ఈసారీ వడ్డీ రేట్లలో యథాతథ స్థితికే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ నెలలో జరగబోయే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమీక్షలో రెపో రేటును మరోసారి యథాతథంగా ఉంచే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మంగళవారం పీటీఐ నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యం 4 శాతం పరిధిలోనే ఉండటంతో వేచి చూసే వైఖరిని అవలంబించవచ్చు. గడిచిన ఏడాది కాలంగా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆర్‌బీఐ.. అందుకోసం రెపో రేటును ఏకంగా 1.25 శాతం తగ్గించింది. అయితే, ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల మార్కెట్లో మిగతా వస్తువుల ధరలు కూడా పెరుగుతాయేమోననే ఆందోళన ఉంది. కానీ, ధరలు పెరిగినప్పుడు ఆర్‌బీఐ వెంటనే కంగారుపడి రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఈ ధరల పెరుగుదల ప్రభావం మిగతా రంగాలపై ఎలా పడుతుందో గమనించి, పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఆర్‌బీఐకి ఉందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఆర్థికవేత్త గౌరా సేన్‌గుప్తా వివరించారు. మరోవైపు, రెపో రేటును యథాతథంగా కొనసాగించే ప్రక్రియ తాత్కాలికమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంధన ధరల ప్రభావంతో 2026-27లో ద్రవ్యోల్బణం 5 శాతం దాటే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే నెలల్లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని కొందరు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

Next Story