ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రేపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-09 05:00:10  IST  )

ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది....

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. రేపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపోరేటుపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 6.25 శాతం నుంచి 6 శాతానికి రెపోరేటు తగ్గించింది. దీంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.

కాగా ఐదేళ్ల తర్వాత గత ఫిబ్రవరి నాటి ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరిగిన సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించారు. ఈ మేరకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గించింది. ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దశలోనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేట్లను తగ్గించింది. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికాకు కీలక ఎగుమతిదారుగా ఉన్న భారత్‌లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, దేశీయంగా వినియోగం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కొనసాగించేందుకు రేట్లపై ఆర్‌బీఐ కోత విధించింది.

Next Story