RBI: కీలక రేట్లలో మరోసారి కోతకు అవకాశం

by S Gopi |

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు.

RBI: కీలక రేట్లలో మరోసారి కోతకు అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల వరుస రెండు సమావేశాల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను పావు శాతం చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యం 4 శాతం కంటే తక్కువకు పరిమితం చేయడంతో పాటు అమెరికా టారిఫ్ కారణంగా ఏర్పడిన ప్రపంచ అనిశ్చితి నేపథ్యంలో వృద్ధిని కొనసాగించేందుకు మూడోసారి 25 బేసిస్ పాయింట్ల కోత విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం జూన్ 4న ప్రారంభం కానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను 6న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కీలక రెపో రేటును రెండు సార్లు తగ్గించి 6 శాతానికి చేర్చిన ఆర్‌బీఐ, ఏప్రిల్‌లో పాలసీ వైఖరిని స్థిర విధానం నుంచి సర్దుబాటు వైఖరికి సవరించింది.

ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ మరోసారి 25 బేసిస్ పాయిట్లు తగ్గించే దిశగా ఆలోచించవచ్చని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ముఖ్యమనే అంచనాలున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. అమెరికా ఇటీవల వాయిదా వేసిన టారిఫ్ అమలు జూలైతో ముగియనుంది. దీనివల్ల అంతర్జతీయ పరిణామాలు భారత ఆర్థికవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై ఆర్‌బీఐ పరిశీలన ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ భాగం సీపీఐ ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉండే అవకాశాల మధ్య ఆర్‌బీఐ ఎంపీసీ రేట్ల సడలింపును కొనసాగించవచ్చని ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. వచ్చే వారం 25 బేసిస్ పాయింట్ల రేటు కోత, ఆ తర్వాత తదుపరి రెండు విధాన సమీక్షలలో మరో రెండు కోతలు ఉంటాయని, చివరిగా రెపో రేటు 5.25 శాతానికి చేర్చవచ్చని ఆమె పేర్కొన్నారు.

Next Story