RBI: ఆర్‌బీఐ కీలక రేట్లను 5.25 శాతానికి తగ్గించే అవకాశం: ఆర్థికవేత్తలు

by S Gopi |

రూపాయిపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, వినియోగం పెరిగేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవచ్చని ఆర్థికవేత్తలు వెల్లడించారు.

RBI: ఆర్‌బీఐ కీలక రేట్లను 5.25 శాతానికి తగ్గించే అవకాశం: ఆర్థికవేత్తలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో జరగబోయే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని, తద్వారా రెపో రేటు 5.25 శాతానికి చేరుస్తుందని రాయిటర్స్ ఆర్థికవేత్తలు తెలిపారు. 2026 వరకు ఈ రేటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడం, కేంద్రం తెచ్చిన పన్ను రేట్ల తగ్గింపు వంటి అంశాల కారణంగా అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25 శాతానికి చేరింది. భారత కరెన్సీ రూపాయిపై ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, వినియోగం పెరిగేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకోవచ్చని ఆర్థికవేత్తలు వెల్లడించారు. గతవారం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 89.49 డాలర్ల రికార్డు స్థాయికి పతనమైంది. ఈ పరిణామాలు ఆర్‌బీఐ రేట్ల కోతకు కారణాలుగా మారవచ్చు. రాయిటర్స్ ఆర్థికవేత్తాల్లో దాదాపు 80 శాతం(80 మందిలో 62 మంద్) మంది ఆర్‌బీఐ రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తుందని అంచనా వేశారు. మిగిలిన 18 మంది యథాతథంగా ఉండవచ్చని చెప్పారు. వచ్చే ఏడాది చివరి వరకు కనీసం ఈ స్థాయిలో రేట్లు ఉంటాయని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

మరోవైపు, పదే పదే వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, భారతీయ వస్తువులపై 50 శాతం అమెరికా దిగుమతి సుంకం కొనసాగుతూనే ఉంది. ఇది ప్రైవేట్ పెట్టుబడులకు ప్రతిబంధకంగా మారింది. దీనివల్ల విదేశీ పెట్టుబడిదారులు సైతం ఈ ఏడాది భారతీయ ఈక్విటీల నుంచి దాదాపు 17 బిలియన్ డాలర్ల(రూ. 1.52 లక్షల కోట్ల)ను ఉపసంహరించుకున్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా తెలియదని కెనరా బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ మాధవన్ కుట్టి చెప్పారు. వచ్చే ఏడాది ప్రథమార్థం వరకు రెపో రేటు 5.25 శాతం వద్దే ఉండోచ్చని ఆయన పేర్కొన్నారు.

Next Story