లాంగ్ వీకెండ్.. భారీగా పెరిగిన ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు

by Naga Rani Yarlagadda |

లాంగ్ వీకెండ్ కావడంతో మళ్లీ పట్టణాలన్నీ పల్లెలకు క్యూ కడుతున్నాయి. తెలుగువారి పండుగ ఉగాది, రంజాన్ సెలవులతో ఆదివారం కలిసి వచ్చింది.

లాంగ్ వీకెండ్.. భారీగా పెరిగిన ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస సెలవులు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో ఉండే ఉద్యోగులంతా కుటుంబాలతో సహా సొంతూరికి వెళ్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు వాటి ఛార్జీలను ఊహకందనంతగా పెంచేస్తున్నాయి. మార్చి 19న ఉగాది, 21న రంజాన్, 22 ఆదివారం, మధ్యలో శుక్రవారం సెలవు పెట్టుకుంటే.. నాలుగురోజులు పండుగలకు ఇంటికి వెళ్లాలని చాలామంది ప్లాన్ చేసుకున్నారు. అయితే అందుబాటులో ఉండే రైళ్లు, బస్సులన్నీ ఫుల్ అవ్వడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులే దిక్కవుతున్నాయి. కానీ.. వాటి ఛార్జీలు చూస్తే.. ఇంటికి వెళ్లకుండా ఉండటమే బెటరని ఆగిపోతున్నారు. ఉదాహరణకు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రైవేట్ ట్రావెల్స్ కనీస బస్ ఛార్జీ రూ.1500 నుంచి రూ.2000 వరకూ ఉంటుంది. కానీ.. వరుస సెలవులు కావడంతో కొన్ని ట్రావెల్స్ బస్సులు ఛార్జీలను డబుల్ కంటే ఎక్కువ చేశాయి. 3 స్టార్ రేటింగ్ ఉన్న bmcc travels నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఛార్జీ ఒకరికి రూ.5700 ఉండగా.. మైత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు నాన్ ఏసీ స్లీపర్ ఒకరికి రూ.4999 గా చేసింది. కొత్తగా వచ్చిన షాహీన్ హాలిడేస్ ఏసీ స్లీపర్ బస్సు ఛార్జీ ఒకరికి రూ.5319 గా పెట్టింది. ఈ ఛార్జీలు చూసిన ప్రయాణికులు సొంతూరికి వెళ్లడం కంటే అక్కడే ఉండటం మేలని భావించి.. తమ ప్లాన్స్ ను రద్దు చేసుకుంటున్నారు. క్రిస్మస్, సంక్రాంతి, దసరా పండుగల సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు పెంచితే చర్యలు తీసుకుంటామని చెప్పే అధికారులు.. ఇలా లాంగ్ వీకెండ్స్ వచ్చినపుడు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ, గోదావరి జిల్లాల వైపు వెళ్లే ట్రావెల్స్ బస్సుల ఛార్జీలు కూడా స్వల్పంగా పెరిగినట్లు ప్రయాణికులు చెప్తున్నారు.

Next Story