PNB: పీఎన్‌బీలో భారీగా సీనియర్ల బదిలీ

by S Gopi |

దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పనితీరుపై ఇలాంటి భారీ బదిలీల ప్రక్రియ ప్రభావం చూపుతుందని ఆ లేఖలో పేర్కొంది.

PNB: పీఎన్‌బీలో భారీగా సీనియర్ల బదిలీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ పంజాన్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో ఉద్యోగుల బదిలీ కొత్త వివాదానికి దారితీసింది. స్కేల్ 4, అంతకంటే పై స్థాయి అధికారుల భారీస్థాయి బదిలీలను పునఃపరిశీలించాలని కోరుతూ పీఎన్‌బీ అధికారుల సంఘం బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాసింది. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పనితీరుపై ఇలాంటి భారీ బదిలీల ప్రక్రియ ప్రభావం చూపుతుందని ఆ లేఖలో పేర్కొంది. బ్యాంకు ఎండీ, సీఈఓ అశోక్ చంద్రకు రాసిన లేఖలో.. ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, తమ మొత్తం సిబ్బందిలో దాదాపు నాలుగో వంతు అయిన 1,142 మంది స్కేల్ 4 అధికారులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపింది. నిర్ణీత విధానాలను విస్మరించి, యాజమాన్యం పెద్ద సంఖ్యలో చీఫ్ మేనేజర్-ర్యాంక్ అధికారుల బదిలీకి ఏకపక్షంగా ఆదేశించిందని, ఈ నిర్ణయం బ్యాంకు వృద్ధి కోసం తీసుకున్న విధానం కాదని, ఇది 'ఉద్దేశపూర్వక ' చర్య అని ఆ లేఖలో పేర్కొంది. గత 2-5 ఏళ్లుగా కొంతమంది అధికారులు ఇతర జోన్‌లకు పోస్టింగ్ కోసం పదేపదే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, యాజమాన్యం వాటిని ఆమోదించలేదు. ఇప్పుడు, ఈ అధికారులను ఏకపక్షంగా కొన్ని ఇతర జోన్‌లకు బదిలీ చేశారని ఆల్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దిలీప్ సాహా వెల్లడించారు.

కొందరు మహిళా అధికారులు తమ సొంత సర్కిల్ వెలుపల ఉన్న జోన్/సర్కిల్‌లో ఇప్పటికే పనిచేస్తున్న వారి విషయంలో ఇదే జరిగింది. వారు ఇప్పటికే జీవిత భాగస్వామి, కుటుంబంతో కాకుండా వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఈ బదిలీల్లోనైనా వారికి అవసరమైన జోన్‌లలో నియమించి ఉంటే, రొటేషన్ పద్ధతిలో ప్రయోజనం ఉండేదని అధికారుల సంఘం అభిప్రాయపడింది. తాజా బదిలీల్లో పదవీ విరమణకు 3 నెలల నుంచి ఏడాది సమయం ఉన్న అధికారులను కూడా దూరంలోని జోన్‌లకు బదిలీ చేశారు. వారు అడిగిన బదిలీ అభ్యర్థనలను కూడా పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, తీసుకున్న కఠిన వైఖరిని వదిలి, ఒక సర్కిల్ లేదా జోన్‌లో పదవీకాలాన్ని కనీసం 6 ఏళ్లకు పెంచాలని అధికారులు కోరారు.

Next Story