PNB: ఏఐ సైబర్ ముప్పులపై పీఎన్‌బీ అలర్ట్

by S Gopi |

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ బడ్జెట్‌లో దాదాపు 20 శాతం మొత్తాన్ని సైబర్ భద్రత కోసం కేటాయించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సురేంద్రన్ తెలిపారు.

PNB: ఏఐ సైబర్ ముప్పులపై పీఎన్‌బీ అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ బ్యాంకింగ్ విస్తరిస్తున్న సమయంలో సైబర్ ముప్పు కూడా వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ రావడంతో బ్యాంకింగ్ రంగంలో భద్రతా సవాళ్లు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) సైబర్ సెక్యూరిటీపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టెక్నాలజీ బడ్జెట్‌లో దాదాపు 20 శాతం మొత్తాన్ని సైబర్ భద్రత కోసం కేటాయించినట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సురేంద్రన్ తెలిపారు. ఈ ఖర్చు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. గతేడాదితో పోలిస్తే ఈ కేటాయింపు 50 శాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఏఐ ఆధారిత సైబర్ దాడులు, డేటా చోరీలు, డిజిటల్ మోసాల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు సెక్యూరిటీ సిస్టమ్స్‌ను బలోపేతం చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకుల సైబర్ సెక్యూరిటీ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికే పీఎన్‌బీ సెక్యూరిటీ టెక్నాలజీ కొనుగోళ్లను వేగవంతం చేసింది. ఫైర్‌వాల్స్, డిజిటల్ మానిటరింగ్ టూల్స్, రిస్క్ డిటెక్షన్ సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ 24 గంటల పాటు సైబర్ ఆడిట్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే గుర్తించి స్పందించేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. కాగా, తాజా త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకు నికర లాభం 14 శాతం పెరిగి రూ.5,225 కోట్లకు చేరుకుంది. రుణాలు 12.7 శాతం, డిపాజిట్లు 9.2 శాతం వృద్ధి నమోదు చేశాయి. డిజిటల్ భద్రతను బలోపేతం చేస్తూనే వ్యాపార విస్తరణపై కూడా దృష్టి సారిస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది.

Next Story