పీఎల్ఐ పథకంతో రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులు

by Dishanational1 |
పీఎల్ఐ పథకంతో రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ మార్కెట్లలో దేశీయ తయారీ రంగాల పోటీ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) ద్వారా 2023, డిసెంబర్ వరకు రూ. 1.06 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 14 రంగాల్లో ఫార్మా, సోలార్ మాడ్యూల్స్ అత్యధికంగా సగానికి పైగా పెట్టుబడులను సాధించాయి. గతేడాది డిసెంబర్ నాటికి ఐటీ హార్డ్‌వేర్, ఆటో అండ్ ఆటో ఆటోకాంపొనెంట్స్, టెక్స్‌టైల్స్, ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ వంటి రంగాల్లో ఈ స్కీమ్‌కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. 2021లో 14 రంగాలకు ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని రూ. 1.97 లక్షల కోట్ల వ్యయంతో ప్రకటించింది. డేటా ప్రకారం, గతేడాది డిసెంబర్ వరకు ఫార్మా అండ్ డ్రగ్స్ రూ. 25,813 కోట్లతో ఎక్కువ పెట్టుబడులు సాధించింది. ఈ రంగంలో ప్రభుత్వం రూ. 17,275 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఇందులో ప్రధానంగా డా రెడ్డీస్ లాబొరేటరీస్, సిప్లా, గ్లెన్‌మార్క్ ఫార్మా, బయోకాన్, వోకార్డ్ కంపెనీ ఎక్కువ లబ్ది పొందాయి. ఇక, సోలార్ పీవీ మాడ్యూల్ రంగంలో రూ. 1.10 లక్షల కోట్లు వస్తాయనుకుంటే, రూ. 22,904 కోట్లు వచ్చాయి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, అదానీ ఇన్‌ఫ్రా, టాటా పవర్ సోలార్ ఎక్కువ లబ్ది పొందాయి.

మిగిలిన రంగాల్లో బల్క్ డ్రగ్స్( రూ. 3,586 కోట్లు), వైద్య పరికరాలు (రూ. 864 కోట్లు), ఫుడ్ ప్రాసెసింగ్ (రూ. 7,350 కోట్లు), టెలికాం (రూ. 2,865 కోట్లు), ఐటీ హార్డ్‌వేర్‌లో అత్యల్పంగా రూ.270 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇతర పీఎల్ఐ సెక్టార్‌లలో ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్ (రూ. 13,037 కోట్లు), టెక్స్‌టైల్స్ (రూ. 3,317 కోట్లు), ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ (రూ. 3,236 కోట్లు) ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రంగాలను సమీఖిస్తోంది. మెరుగైన పెట్టుబడులు రాబట్టడంతో విఫలమైన రంగాల కోసం పథకాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.

Next Story

Most Viewed