- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Piyush Goyal: వినియోగదారులకు పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను అందించాలని కోరిన పీయుష్ గోయల్
చిన్న, పెద్ద సంస్థలు మరిన్ని అవకాశాలను పొందుతాయి, ఉద్యోగావకాశాలు, ఆదాయాలు పెరుగుతాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి పియూష్ గోయల్ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను పూర్తిగా ప్రజలకు అందించాలని మరోసారి పరిశ్రమ వర్గాలను కోరారు. దీనివల్ల దేశీయ డిమాండ్‌ను పెరుగుతుంది, వ్యాపారాలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది, దేశ ఆర్థికవ్యవస్థ పునాదులను బలోపేతం చేస్తుందని అన్నారు. సోమవారం ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఈపీసీ) ఇండియా కార్యక్రమంలో పీయుష్ గోయల్ మాట్లాడుతూ.. 'పన్ను సరళీకరణతో పాటు జీఎస్టీ రేటు కోతలు దేశీయ డిమాండ్‌ను పెంచుతాయి. చిన్న, పెద్ద సంస్థలు మరిన్ని అవకాశాలను పొందుతాయి, ఉద్యోగావకాశాలు, ఆదాయాలు పెరుగుతాయి. ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మంచి వృద్ధి అవకాశమన్నారు.
భారత వృద్ధిని ఏ శక్తి ఆపలేదు
ఈ సందర్భంగా గోయల్.. ప్రపంచంలోని ఏ శక్తి కూడా భారత్‌ను ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగకుండా ఆపలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే సమాన ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందాలని, జీఎస్టీ కోత ప్రయోజనాలు వినియోగదారులకు నేరుగా చేరాలని ఆయన అన్నారు. ఇది సమ్మిళిత వృద్ధిని, పటిష్టమైన ఆర్థికవ్యవస్థను అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల విలువైన మన ఆర్థికవ్యవస్థ, రాబోయే 2–2.5 ఏళ్లలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. 2047 నాటికి కనీసం 30 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని పీయుష్ గోయల్ అంచనా వేశారు. జీఎస్టీ సరళీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధితో, మనదేశం ప్రపంచ శక్తిగా అవతరించే మార్గంలో బలంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పిలుపును స్వీకరించి స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని పెంచేందుకు మద్దతు ఇవ్వాలని పరిశ్రమలను కోరారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, మనం తయారు చేసుకున్న వస్తువులను ప్రోత్సహించడం ద్వారా, వ్యాపారాలు ఆర్థిక భద్రత, జాతీయ పురోగతికి దోహదపడతాయని వివరించారు. దేశంలో తయారైన అధిక-నాణ్యతా ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యేలా చూసుకోవాల్సిన అవసరాన్ని పీయుష్ గోయల్ ప్రస్తావించారు. మనదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ భాగస్వామిగా ఉంది. దాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం అని అన్నారు.






