Phonepe: రూ. 12,000 కోట్లతో ఐపీఓకు వస్తున్న ఫోన్‌పే

by S Gopi |

దాదాపు రూ. 11,000 నుంచి రూ. 12,000 కోట్ల వరకు సేకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Phonepe: రూ. 12,000 కోట్లతో ఐపీఓకు వస్తున్న ఫోన్‌పే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే త్వరలో భారీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టనుంది. మదుపర్ల నుంచి రూ. 12,000 కోట్లను సేకరించే లక్ష్యంతో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఫోన్‌పే డ్రాఫ్ట్ పేపర్లు అందజేసినట్టు తెలుస్తోంది. భారతీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు ప్రీ-ఫైలింగ్ మార్గంలో ఐపీఓ కోసం దాఖలు చేసినట్టు సమాచారం. ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే నిధుల సమీకరణ చేపట్టనుంది. ఐపీఓ పరిమాణంపై కంపెనీ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనప్పటికీ, దాదాపు రూ. 11,000 నుంచి రూ. 12,000 కోట్ల వరకు సేకరించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో కంపెనీలో వాటాదారులుగా ఉన్న వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, టైగర్ గ్లోబల్ పాల్గొంటాయి, ఈ సంస్థలు 10 శాతం మేర వాటాను విక్రయానికి షేర్లను ఇవ్వనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఫోన్‌పే స్టాక్ మార్కెట్లో పబ్లిక్ లిస్టింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నట్టు ప్రకటించింది. 2015లో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఫోన్‌పే 2016లో ప్రధాన కార్పొరేట్ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్‌కు మార్చింది. ఆ తర్వాత 2022లో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ రూ. 8,000 కోట్ల పన్నులు చెల్లించి మరీ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కు మార్చారు. కాగా, ఫోన్‌పే కంటే ముందు పేటీఎం, మొబిక్విక్ వంటి ఫిన్‌టెక్ కంపెనీలు ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలోకి ఎంటర్ అయ్యాయి. అయితే, ఈ రెండు కంపెనీల షేర్లు ఆశించిన స్థాయిలో ర్యాలీ చేయలేకపోయాయి.

Next Story