Whatsapp Spam: అందరూ వాట్సాప్ స్పామ్ బాధితులే

by S Gopi |

దాదాపు 96 శాతం వాట్సాప్ యూజర్లు ప్రతిరోజూ ఈ స్పామ్ మెసేజ్, కాల్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Whatsapp Spam: అందరూ వాట్సాప్ స్పామ్ బాధితులే
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాట్సాప్‌లో స్పామ్‌ మెసేజ్‌లు, కాల్స్‌ బెడద ఎక్కువైపోయాయి. దీనిపై చాలామంది నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నెంబర్లతో వచ్చే కాల్స్‌ మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి స్పామ్ మేసేజ్‌లు, కాల్స్‌ను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు కూడా రకరకాల స్కామ్‌లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. పెరుగుతున్న డిజిటల్ వినియోగానికి తగినట్టుగా ఈ స్పామ్ కాల్స్, మేసేజ్‌లు పట్టణాలకే పరిమితం కాలేదు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి వాట్సాప్ యూజర్ ప్రతిరోజూ ఏదొక స్పామ్, ప్రమోషనల్ వాట్సాప్ మెసేజ్‌లను ఎదుర్కొంటున్నారు. ప్రముఖ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో మరిన్ని వివరాలు బహిర్గతం అయ్యాయి. దాదాపు 96 శాతం వాట్సాప్ యూజర్లు ప్రతిరోజూ ఈ స్పామ్ మెసేజ్, కాల్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కస్టమర్ల ప్రైవసీ, డేటా దుర్వినియోగం, స్పామ్‌ల తనిఖీలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిరోజూ వాట్సాప్‌లో స్పామ్ మెసేజ్‌లు

వాట్సాప్‌లో ప్రతిరోజూ రకరకాల ప్రమోషనల్, స్పామ్ మెసేజ్‌లు వస్తున్నాయని యూజర్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 324 జిల్లాల్లోని వాట్సాప్ యూజర్ల నుంచి లోకల్ సర్కిల్స్ వివరాలను సేకరించగా, కేవలం 4 శాతం మంది మాత్రమే తమకు అటువంటి మెసేజ్‌లు రావట్లేదన్నారు. సగం మందికి(54 శాతం) పైగా యూజర్లు రోజుకు మూడు సార్లు స్పామ్ మెసేజ్‌లు వస్తున్నాయని, 30 శాతం మంది 4-7 స్పామ్ మెసేజ్‌లను, 11 శాతం మంది 8, అంతకంటే ఎక్కువ మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పారు. ఈ మెసేజ్‌లలో ఎక్కువగా బిజినెస్ అకౌంట్ల నుంచి వస్తున్నాయని, స్పామ్ మెసేజ్‌లు పంపేవారు వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు డబ్బు చెల్లిస్తున్నారని యూజర్లు తెలిపారు.

గత 36 నెలల్లో మరింత తీవ్రం

ప్రస్తుతం వస్తున్న స్పామ్‌లు మూడేళ్ల నాటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయని లోకల్ సర్కిల్స్ నివేదిక అభిప్రాయపడింది. గత 36 నెలల్లో స్పామ్‌ల సమస్య మరింత తీవ్రమైందని డేటా చెబుతోంది. రోజుకు ఒకటి నుంచి మూడు స్పామ్ మెసేజ్‌లను ఎదుర్కొనే యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ, 4-7 మెసేజ్‌లు, 8 లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్‌లను చూసే యూజర్ల సంఖ్య బాగా పెరిగింది. ప్రతిరోజూ 8 లేదా అంతకంటే ఎక్కువ స్పామ్ మెసేజ్‌లు చూసే వారు 2023లో 11 శాతం ఉండగా, ఇప్పుడు 19 శాతానికి పెరిగారు.

ఆర్థిక, రియల్ ఎస్టేట్ స్పామ్‌లే ఎక్కువ

వాట్సాప్‌లో స్పామ్ మెసేజ్‌లు ప్రధానంగా ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ సంబంధించినవే ఎక్కువ. ఈ రంగాలకు చెందిన కంపెనీల పేరుతో స్పామ్ మెసేజ్‌లు వస్తున్నాయని 71 శాతం మంది యూజర్లు చెబుతున్నారు. వీటి తర్వాత హెల్త్‌కేర్(46 శాతం), జాబ్ ఆఫర్లు (44 శాతం) ఉన్నాయి. ఇతర విభాగాల్లో ఆర్ఓ రిపేర్లు, బ్యూటీ సర్వీసెస్, ఆన్‌లైన్ గేమింగ్, మొబైల్ ప్లాన్‌లు వంటివి ఉన్నాయి.

పరిష్కారమేంటంటే..

యూజర్లు స్పామ్‌ల చిరాకు నుంచి బయటపడేందుకు వాట్సాప్ 'సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ' పేరుతో ఫీచర్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వచ్చినట్టు కూడా కనిపించదు. కానీ, కాల్ లిస్ట్‌లో కాల్స్ వచ్చిన నంబర్లు తెలుసుకోవచ్చని వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు..

* వాట్సాప్‌లోని సెట్టింగ్స్‌లో ప్రైవసీ చెకప్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* ఆ తర్వాత 'స్టార్ట్ చెకప్'పై క్లిక్ చేయగానే, 'ఛూజ్ కెన్ కాంటాక్ట్ యూ' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో 'సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్'పై క్లిక్ చేశాక, 'సైలెన్స్ అన్‌నోన్ కాల్స్ ఆప్షన్ 'ను ఆన్‌లో ఉంచుకోవాలి. దీని తర్వాత ఏ నంబర్ నుంచైనా స్పామ్ కాల్స్ రావు.

Next Story