దాదాపు రెట్టింపు పెరిగిన దేశ తలసరి ఆదాయం!

by Disha Web Desk 13 |
దాదాపు రెట్టింపు పెరిగిన దేశ తలసరి ఆదాయం!
X

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం తలసరి ఆదాయం రూ. 1.72 లక్షలకు చేరిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) తెలిపింది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది దాదాపు రెట్టింపు పెరగడం గమనార్హం. 2014-15లో తలసరి ఆదాయం రూ. 86,647గా ఉంది. ప్రస్తుత ధరల వద్ద అది రూ. 1,72,000కి చేరగా, ఇది 99 శాతం వృద్ధి అని ఎన్ఎస్ఓ వెల్లడించింది. స్థిర ధరల వద్ద 2014-15లో భారత తలసరి ఆదాయం రూ. 72,805 నుంచి ప్రస్తుతం రూ. 98,118కి దాదాపు 35 శాతం పెరిగింది. ద్రవ్యోల్బణ పరంగా చూస్తే ప్రస్తుత ధరల వద్ద పెరిగిన తలసరి ఆదాయం చాలా తక్కువని ఆర్థికవేత్త జయతి ఘోష్ చెప్పారు.

ఇదే సమయంలో సంపదలో పై వరుసలో ఉన్న 10 శాతం మంది వల్లే తలసరి ఆదాయం అత్యధికంగా పెరిగిందని, దానికి విరుద్ధంగా సగటు వేతనాలు పడిపోయాయని ఆమె వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుత ధరలు, స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం క్షీణించిందని, 2021-22, 2022-23లలో మళ్లీ పుంజుకున్నాయని జయతి ఘోష్ తెలిపారు. స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం పెరగడం పెరుగుతున్న సంపదను సూచిస్తుందని ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్(ఐఎస్ఐడీ) డైరెక్టర్ నగేశ్ కుమార్ చెప్పారు. కానీ తలసరి ఆదాయం అనేది ప్రజల సగటు ఆదాయం, ఇది ఆర్థిక అసమానతలను కప్పివేస్తుందని ఆయన తెలిపారు. సంపద పరంగా చివర్లో ఉన్నవారి పరిస్థితి ఏ మాత్రం మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిచినప్పుడు భారత ఆర్థికవ్యవస్థ పరిస్థితి మెరుగ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.


Next Story