Pepsico: భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించిన పెప్సికో

by S Gopi |

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పెప్సికో ఇండియా సీఈఓ జాగృత్ చెప్పారు.

Pepsico:  భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించిన పెప్సికో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ కూల్‌డ్రింక్స్ విభాగంలో రిలయన్స్ సంస్థ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ రంగంలో పోటీ తీవ్రతరమైంది. ఇటీవలే రిలయన్స్ సాఫ్ట్‌డ్రింక్‌తో పాటు స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో పోటీ కంపెనీ పెప్సికో కూడా అప్రమత్తమైంది. ఇటీవల అమెరికాకు చెందిన కొత్త స్పోర్ట్స్ డ్రింక్‌ను విడుదల చేసిన పెప్సికో తాజాగా భారత మార్కెట్లో మరింత వేగవంతంగా విస్తరణ చేపట్టనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు పెప్సికో ఇండియా, దక్షిణాసియా సీఈఓ జాగృత్ కొటేచా చెప్పారు. భారత్‌ను అత్యంత కీలకమైన మార్కెట్‌గా చూస్తున్నామని చెప్పిన ఆయన, ఇక్కడ కంపెనీ సామర్థ్యన్ని పెంచేందుకు మరిన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధానంగా ఫుడ్, స్నాక్స్, పానీయాల విభాగంలో భారత్ ప్రధాన మూడు మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇతర కంపెనీలతో పోలిస్తే భారత మార్కెట్ పెప్సికోకు ముఖ్యమైన గ్రోత్ ఇంజిన్ లాంటిది. ఇప్పటికే కంపెనీ ఉత్తరప్రదేశ్‌తో పాటు అస్సాంలలోని గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ల కోసం పెట్టుబడులు పెట్టింది. అస్సాంలోని ప్లాంటు ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రారంభించనుంది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులతో పాటు దక్షిణాదిలో మరో రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. గత మూడేళ్లలో పెప్సికో భారత మార్కెట్లో దాదాపు రూ. 3,500 నుంచి రూ. 4,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దేశీయంగా మరింత విస్తరణకు అవకాశం ఉండటం, పోటీ పెరిగిన నేపథ్యంలో కొత్త వ్యూహాలను అనుసరించాలని పెప్సికో భావిస్తోంది.

Next Story