Paytm: తక్షణ అవసరాలకు 'యూపీఐ క్రెడిట్ లైన్ ' సదుపాయం ప్రారంభించిన పేటీఎం

by S Gopi |

30 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్‌ను పొందవచ్చు. ఇది రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుంది.

Paytm: తక్షణ అవసరాలకు యూపీఐ క్రెడిట్ లైన్  సదుపాయం ప్రారంభించిన పేటీఎం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం తన కస్టమర్లకు ప్రత్యేక యూపీఐ క్రెడిట్ లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సూర్యోదయ స్మాల్‌ఫైనాన్స్ బ్యాంకుతో భాగస్వామ్యం ద్వారా 'పేటీఎం పోస్ట్‌పెయిడ్'ను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులు ఏదైనా అవసరానికి తక్షణ చెల్లింపులు చేయవచ్చు. 'ఇప్పుడు ఖర్చు చేయండి, వచ్చే నెలలో చెల్లించండి' అనే ట్యాగ్‌లైన్‌తో పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ ఉపయోగించి వినియోగదారులు 30 రోజుల వరకు వడ్డీ లేని క్రెడిట్‌ను పొందవచ్చు. ఇది రోజువారీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. వినియోగదారులు కేవైసీ పూర్తి చేసి, వారి యూపీఐ ఖాతాను సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో లింక్ చేసి, యూపీఐ పిన్‌ను సెటప్ చేయడం ద్వారా పేటీఎం యాప్ నుంచి నేరుగా పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ క్రెడిట్ లైన్ రూ. 60,000 వరకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ పొందుతారు. దీనికి నెలరోజుల పరిమితి ఉంటుంది. ఈ రుణాన్ని షాపింగ్, బిల్లుల చెల్లింపులు, రీఛార్జ్‌లు, బుకింగ్‌లు వంటి వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. వినియోగదారులకు 30 రోజుల వడ్డీ లేకుండా వాడుకుని, తిరిగి చెల్లించే సదుపాయం ఉంటుంది. ఖర్చు చేసిన మొత్తానికి మాత్రమే నామమాత్రపు ఛార్జీలు వర్తిస్తాయి. అయితే, ఈ క్రెడిట్ సదుపాయాన్ని ఉపయోగించి పర్సన్ టూ పర్సన్(పీ2పీ) లావాదేవీలు చేసే అవకాశం ఉండదు.

'పేటీఎం పోస్ట్‌పెయిడ్' ఎలా పొందాలంటే..

* పేటీఎం యాప్‌లోని హోమ్ స్క్రీన్‌లో పేటీఎం పోస్ట్‌పెయిడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* కేవైసీ పూర్తి చేసి, యూపీఐ క్రెడిట్ లైన్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి.

* యూపీఐ తరహాలోనే పిన్‌ ఎంటర్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌, ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, యుటిలిటీ బిల్లు చెల్లింపులను చేయవచ్చు.

* నెలకు రూ.60 వేలు వరకు పరిమితితో ఖర్చు చేయవచ్చు.

* 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. ఆ తర్వాత తిరిగి చెల్లించవచ్చు.

* ప్రతి నెలా ఒకటవ తేదీన బిల్లింగ్‌ జరుగుతుంది.

Next Story