భారీ డిస్కౌంట్‌తో పెయింట్ ఉత్పత్తులు విడుదల చేసిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్

by Dishanational1 |
భారీ డిస్కౌంట్‌తో పెయింట్ ఉత్పత్తులు విడుదల చేసిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కొత్తగా పెయింట్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో ధరల పోటీకి తెరలేపింది. బిర్లా ఓపస్ పేరుతో పెయింట్ ఉత్పత్తులను తీసుకొస్తామని చెప్పిన కంపెనీ, మంగళవారం వాటిని 5-6 శాతం డిస్కౌంట్‌తో మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా పెయింట్ మార్కెట్లో లీడర్‌గా ఉన్న ఏషియన్ పెయింట్స్ ఉత్పత్తుల కంటే తక్కువకు అందించడం ద్వారా మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలని గ్రాసిమ్ భావిస్తోంది. ఈ తగ్గింపు ఇంటీరియర్స్, ఎక్స్‌టీరియర్స్, ఎనామెల్, వాటర్ ప్రూఫింగ్, ఉడ్ ప్రైమర్ వంటి విభాగాల్లో వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. గ్రాసిమ్ సంస్థ ఈ ఫిబ్రవరిలో తన ఓపస్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలను ప్రారంభించిన మూడేళ్లలో రాబడి రూ. 10 వేల కోట్లకు చేరుకున్న తర్వాతే వ్యాపారం లాభదాయకంగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. రూ. 80 వేల కోట్లతో భారత డెకొరేటివ్ పెయింట్ మార్కెట్లో ఆధిపత్యం కలిగిన ఏషియన్ పెయింట్ తర్వాత రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించాలని కంపెనీ లక్ష్యంగా ఉంది. పెయింట్ వ్యాపారం కోసం గ్రాసిమ్ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టింది. భారత పెయింట్ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న దానికంటే మరో 40 శాతం సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో గణనీయమైన వాటా సొంతం చేసుకోవాలని చూస్తున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా అన్నారు.


Next Story