Jewellery Industry: ట్రంప్ టారిఫ్‌తో ఆభరణాల పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఎఫెక్ట్

by S Gopi |

ఈసారి 25 శాతం మేర టారిఫ్ విధించడంతో ఈసారి లక్ష మంది వరకూ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని రాజేష్ వివరించారు.

Jewellery Industry: ట్రంప్ టారిఫ్‌తో ఆభరణాల పరిశ్రమలో లక్ష ఉద్యోగాలు ఎఫెక్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనతో మన దేశ ఎగుమతులకు కీలక మద్దతుగా ఉన్న రత్నాభరణాల పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆభరణాల తయారీదారులు, ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా రత్నాభరణాల దేశీయ మండలి ఛైర్మన్ రాజేష్ రోక్డే మాట్లాడుతూ.. చేతితో తయారు చేసిన ఆభరణాల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించలేం. అగ్రరాజ్యం గతంలో 10 శాతం సుంకం విధించినప్పుడు, పరిశ్రమలోని దాదాపు 50,000 మంది కార్మికులు ప్రభావితమయ్యారు. ఈసారి 25 శాతం మేర టారిఫ్ విధించడంతో ఈసారి లక్ష మంది వరకూ ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని, ఫలితంగా ఆభరణాల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతినవచ్చని రాజేష్ వివరించారు. ఇదే సమయంలో భారత్‌పై చూపే దానికంటే ఎక్కువగా అమెరికాపైనా ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌లో తయారయ్యే ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్ లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను ఎంచుకుందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, దేశీయంగా బంగారానికి గిరాకీ తగ్గుతోంది. భారీగా పెరిగిన ధరల కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు పసిడి వినియోగం 5 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) గురువారం ప్రకటనలో తెలిపింది. బంగారం పెట్టుబడులకు డిమాండ్ కనిపిస్తున్నప్పటికీ, అనుకున్న స్థాయిలో లేదు. ఈ ఏడాది మొత్తానికి బంగారం డిమాండ్ 600-700 టన్నులు ఉండొచ్చని అంచనా. ఇది 2020 నాటి కనిష్టం. గతేడాది ఈ డిమాండ్ 802.9 టన్నులుగా నమోదైంది. ప్రస్తుత ధరలే స్థిరంగా కొనసాగితే బంగారం గిరాకీ 700 టన్నుల దాకా ఉండొచ్చని డబ్ల్యూజీసీ రీజనల్ సీఈఓ సచిన్ జైన్ అన్నారు. కాగా, గురువారం సాయంత్రానికి బంగారం ధరలు హైదరాబాద్‌లో స్వల్పంగా తగ్గాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 450 తగ్గి రూ. 1,00,110 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 400 తక్కువగా రూ. 91,700 వద్ద ఉంది. వెండి కిలో రూ. 1,25,000 ఉంది.

Next Story