IPOs: ఐపీఓకు సిద్ధంగా డజను కంపెనీలు

by S Gopi |

వచ్చే రెండు మూడు వారాల్లో ఈ కంపెనీలు దాదాపు రూ. 10,000 కోట్లను సేకరించాలని లక్ష్యంతో ఉన్నాయి

IPOs: ఐపీఓకు సిద్ధంగా డజను కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ఐపీఓ సందడి మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత వంటి చర్యలతో డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమవుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాల్లో ఈ కంపెనీలు దాదాపు రూ. 10,000 కోట్లను సేకరించాలని లక్ష్యంతో ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి క్లియరెన్సులను పొందాయి. ఐపీఓ ద్వారా సేకరించిన మొత్తాన్ని మూలధన వ్యయం కోసం, విస్తరణ ప్రణాళికలు, రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని కంపెనీలు తమ ఐపీఓ పత్రాల్లో పేర్కొన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 55 కంపెనీలు ఐపీఓ ద్వారా సుమారు రూ. 75,000 కోట్ల వరకు నిధులను సేకరించాయి.

గతేడాది 91 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రాగా, అవి రూ. 1.6 లక్షల కోట్లను సమీకరించాయి. గత కొన్ని వారాలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్తున్నప్పటికీ, పాలసీ విధానాలు సానుకూలంగా ఉండటం, సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐలు) కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుండటంతో చాలా కంపెనీలు మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రాబోయే ప్రధాన ఐపీఓలలో జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ రూ. 2,000 కోట్లు, హాస్పిటల్ చైన్ పార్క్ మెడి వరల్డ్ రూ. 1,260 కోట్లు, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ రూ. 1,150 కోట్లు, బయోఫ్యూయల్ ఉత్పత్తిదారు ట్రూఆల్ట్ బయోఎనర్జీ రూ. 1,000 కోట్లు సేకరించాలని భావిస్తున్నాయి. బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రతి షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ రూ. 750 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి.

Next Story