Traffic Rules:ఈ తప్పులు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

by S Gopi |

వాహనదారులు సైతం పదే పదే తప్పులు చేయకుండా నిలువరించేందుకు నిబంధనలను భారీగా సవరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ మోటార్ వెహికల్ రూల్స్‌లో సవరణలు చేసింది.

Traffic Rules:ఈ తప్పులు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొంతకాలంగా దేశంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, రహదారి భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త చర్యలు, నిబంధనలను అందుబాటులోకి తెస్తోంది. దీనికి తోడు రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహనదారులు సైతం పదే పదే తప్పులు చేయకుండా నిలువరించేందుకు నిబంధనలను భారీగా సవరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ మోటార్ వెహికల్ రూల్స్‌లో సవరణలు చేసింది. కొత్త నిబంధనలు ఈ ఏడాది 1 నుంచే అమల్లోకి వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే, డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే జరిమానా వేసి వదిలేయకుండా, డ్రైవింగ్ లైసెన్స్‌ కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. ఆ రూల్స్ ఎంటో తెలుసుకుందాం..!

ట్రాఫిక్ చట్టాలను పదే పదే ఉల్లంఘించే డ్రైవర్లను కట్టడి చేసేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల నిబంధనలను మార్చింది. వీటి ప్రకారం, ఒక ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే డ్రైవర్‌ను మూడు నెలల పాటు డ్రైవింగ్ చేయకుండా సస్పెండ్ చేయనున్నారు. ఈ అధికారం ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) లేదా జిల్లా రవాణా కార్యాలయం(డీటీవో) చేతిలో ఉంటుంది. వారు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేయడానికి అధికారం ఉంటుంది.

కొత్త మార్పులు

గతంలో, వాహన దొంగతనం, ప్రయాణీకులపై దాడి, కిడ్నాప్, అతివేగం, ఓవర్‌లోడింగ్ లేదా బహిరంగ ప్రదేశాల్లో వాహనాన్ని వదిలివేయడం వంటి తీవ్రమైన నేరాలకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేసేవారు. ఈ నిబంధనల ఉల్లంఘనలను ప్రమాదం లేదా ఇబ్బందిగా పరిగణించేవారు. ఇప్పుడు.. ఓవర్‌స్పీడ్, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ లేకపోవడం, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్, ఓవర్‌ లోడింగ్, తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటి 24 రకాల ఉల్లంఘనలను అందుబాటులోకి తెచ్చారు. వీటిలో ఏవైనా ఐదు తప్పులు చేస్తే లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తారు.కొత్తగా హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, రెడ్ లైట్ జంప్ చేయడం వంటి తక్కువ తీవ్రత కలిగిన ఉల్లంఘనలు కూడా లైసెన్స్ రద్దు చేసేలా నిబంధన తీసుకొచ్చారు. డ్రైవర్ ఒక ఏడాదిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే లైసెన్స్ సస్పెన్షన్‌కు దారితీయవచ్చు.

అయితే, లైసెన్స్ రద్దు చేసే ముందు అధికారుల ఎదుట డ్రైవర్లు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించనున్నారు.

ఉల్లంఘనలను ఎలా లెక్కిస్తారంటే

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రతి సంవత్సరం విడిగా ఉల్లంఘనలను పరిగణిస్తారు. ఒక సంవత్సరంలోపు చేసిన ఉల్లంఘనలను మాత్రమే లెక్కించనున్నారు. అంతకుముందు ఏడాదిలోని ట్రాఫిక్ ఉల్లంఘనలు కొత్త లెక్కింపులోకి తీసుకోరు.

టోల్ ఫీజు చెల్లింపులో మార్పులు

ఈ క్రమంలోనే, ప్రజలు టోల్ ఫీజులను కూడా తక్షణం చెల్లించేలా ప్రోత్సహించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూనే, ప్రజలు టోల్ ఫీజులను ఎగవేయకుండా ఆపడం దీని లక్ష్యం. ఈ కొత్త నిబంధనల ప్రకారం, టోల్ ఫీజులు చెల్లించని వాహనాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) లభించదు. దీనర్థం వాహనాన్ని అమ్మడం లేదా మరొక రాష్ట్రానికి ప్రయాణించేందుకు వీలవదు. అలాగే, అన్ని టోల్ బకాయిలు పూర్తిగా చెల్లించకపోయినా, వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేయడం లేదా రెన్యూవర్ల్ చేయడం కుదరదు. కమర్షియల్ వాహనాల కోసం ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. టోల్ ఫీజులు చెల్లించని పక్షంలో, వాహన యజమానికి నేషనల్ పర్మిట్ లభించదు.

సులభంగా చెప్పాలంటే, ప్రభుత్వం అన్ని టోల్ ఫీజులు బకాయి ఉండొద్దని ఆశిస్తోంది. బకాయిలు క్లియర్ అయ్యే వరకు ముఖ్యమైన వాహన సేవలు నిలిపేయనున్నారు.

Next Story