CBDT: 2024లో రూ. 29 వేల కోట్ల విలువైన విదేశీ ఆస్తులను ప్రకటించిన పన్ను చెల్లింపుదారులు

by S Gopi |

దీంతో స్వచ్ఛంద విదేశీ ఆస్తుల వెల్లడిలో గణనీయంగా పెరుగుదల నమోదైందని అధికారులు చెప్పారు.

CBDT: 2024లో రూ. 29 వేల కోట్ల విలువైన విదేశీ ఆస్తులను ప్రకటించిన పన్ను చెల్లింపుదారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది 30,161 మంది పన్ను చెల్లింపుదారులు రూ. 29,208 కోట్ల విలువైన విదేశీ ఆస్తులను వెల్లడించారని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా వారంతా రూ. 1,089.88 కోట్ల తమ అదనపు విదేశీ ఆదాయాలను కూడా పేర్కొన్నారని వెల్లడించారు. దీంతో స్వచ్ఛంద విదేశీ ఆస్తుల వెల్లడిలో గణనీయంగా పెరుగుదల నమోదైందని అధికారులు చెప్పారు. 2021-22 అసెస్‌మెంట్ ఏడాది 60,000 మంది స్వచ్ఛందంగా తమ విదేశీ ఆస్తులను ప్రకటించగా, 2024-25లో ఈ సంఖ్య 2,31,452కి పెరిగింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 45.17 శాతం అధికం కావడం గమనార్హం. గతేడాది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదాయపు పన్ను రిటర్నులలో విదేశీ ఆదాయాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని పన్ను చెల్లింపుదార్లకు సూచించింది. ఇందుకోసం కాంప్లియన్స్‌ కమ్‌ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ కారణంగానే ఐటీఆర్ ఫైలింగ్‌లో విదేశీ ఆస్తుల వెల్లడిలో పెరుగుదల కనిపించింది. అలాగే, గతేడాది 24,678 మంది పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లను రివ్యూ చేసి వివరాలను అప్‌డేట్ చేశారు. 5,483 మంది ఆలస్యంగా రిటర్నులను దాఖలు చేశారు. 6,734 మంది తమ నివాస స్థితిని రెసిడెంట్ నుంచి నాన్-రెసిడెంట్‌గా సవరించారు. సీబీడీటీ చేపట్టిన క్యాంపెయిన్‌కు 62 శాతం పన్ను చెల్లింపుదారులు సానుకూలంగా స్పందించారని, విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని ప్రకటించడానికి తమ ఐటీఆర్‌లను స్వచ్ఛందంగా సవరించుకున్నారని సంబంధితవర్గాలు తెలిపాయి.

Next Story