Railways: అత్యవసర వైద్య సేవలందించడానికి సిద్ధంగా రైల్వే సిబ్బంది

by S Gopi |

అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్ అందించాలనే సూచనలు జారీ చేశాం.

Railways: అత్యవసర వైద్య సేవలందించడానికి సిద్ధంగా రైల్వే సిబ్బంది
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో అత్యవసర వైద్య సేవలను సమర్థవంతంగా నిర్వహించడానికి 16 లక్షలకు పైగా ఫ్రంట్‌లైన్ రైల్వే ఉద్యోగులకు శిక్షణ అందించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. మూడేళ్లుగా వారందరికీ శిక్షణ ఇచ్చామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. రైల్వేలలో అత్యవసర వైద్య కేంద్రాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా పరిశీలించిందని చెప్పారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్ ఉన్న మెడికల్ బాక్స్‌ను అందించాలనే సూచనలు జారీ చేశాం. అలాగే.. టీసీలు, రైల్వే గార్డులు, సూపరింటెండెంట్లు, స్టేషన్ మాస్టర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించడంలో శిక్షణ ఇచ్చాం. వారందరికీ రెగ్యులర్ రిఫ్రెషర్ కోర్సులు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 16,14,748 మంది ఫ్రంట్‌లైన్ రైల్వే ఉద్యోగులకు 2022, ఏప్రిల్ 1 నుంచి 2025, జూన్ 30 వరకు శిక్షణ ఇచ్చామన్నారు. అంతేకాకుండా సమీపంలోని ఆసుపత్రులు, వైద్యుల జాబితా, వారి నంబర్‌లను అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. గాయపడిన, అనారోగ్యానికి గురైన ప్రయాణీకులను ఆసుపత్రులు లేదా క్లినిక్‌లకు తరలించడానికి రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ల అంబులెన్స్ సేవలు ఉపయోగించనున్నట్టు పేర్కొన్నారు.

Next Story