Oracle: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన మార్క్ జుకర్‌బర్గ్

by S Gopi |

పెట్టుబడిదారులు ఏఐ స్టాక్‌లలో విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో ఒరాకిల్ కంపెనీ భారీగా లాభపడింది.

Oracle: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన మార్క్ జుకర్‌బర్గ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని టెక్ దిగ్గజం ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ సొంతం చేసుకున్నారు. దీనికి ఒరాకిల్ షేర్ల ధరలు రికార్డు స్థాయిలో పుంజుకోవడమే కారణం. 251.2 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.21.59 లక్షల కోట్లు) సంపదతో లారీ ఎల్లిసన్‌ రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. పెట్టుబడిదారులు ఏఐ స్టాక్‌లలో విపరీతంగా పెట్టుబడులు పెట్టడంతో ఒరాకిల్ కంపెనీ భారీగా లాభపడింది. 2022, నవంబర్లో చాట్‌జీపీటీ విడుదల చేసినప్పటి నుండి కంపెనీ షేర్లు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. అయితే గత మూడు నెలలుగా కొంత నష్టాలను చూసింది. అయినప్పటికీ స్థిరమైన ఆదాయాన్ని కంపెనీ నమోదు చేసింది. ఇదే సమయంలో కీలక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ చివరి నుంచి స్టాక్ ధర 90 శాతానికి పైగా లాభపడింది. తాజాగా అమెరికా ప్రభుత్వం ఎన్విడియా, అడ్వాన్స్‌డ్ మైక్రో డివైజెస్ సహా చిప్‌మేకర్లు చైనాకు సెమీకండక్టర్లను ఎగుమతి చేసేందుకు అనుమతిస్తుందనే వార్తలతో ఒరాకిల్ షేర్లు మంగళవారం దాదాపు 6 శాతం పెరిగాయి. దీంతో బ్లూమ్‌బర్గ్ ఇండెక్స్‌లో లారీ ఎల్లిసన్ సంపద పెరిగింది. ఆయన సంపదలో 80 శాతానికి పైగా ఒరాకిల్ స్టాక్స్, ఆప్షన్లలో రూపంలో ఉండటమే ఇందుకు కారణం. బ్లూమ్‌బర్గ్ సంపద సూచీ ప్రకారం, ఎలోన్ మస్క్ ఇప్పటికీ 357.8 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.

Next Story