వన్‌ప్లస్ ఇండియా CEO రాబిన్ లియు రాజీనామా.. కంపెనీ కార్యకలాపాలపై కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-25 13:53:13  IST  )

‘వన్‌ప్లస్ ఇండియా’ సీఈవో రాబిన్ లియు తన పదవికి రాజీనామా చేయడంతో భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయన్న వార్తలపై వన్‌ప్లస్ క్లారిటీ ఇచ్చింది.

వన్‌ప్లస్ ఇండియా CEO రాబిన్ లియు రాజీనామా.. కంపెనీ కార్యకలాపాలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబిన్ లియు తన పదవి నుంచి తప్పుకున్నట్లుగా కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీ తన వ్యాపార నిర్మాణాన్ని (restructuring) మారుస్తున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకుంది.

రాజీనామాకు కారణాలు..

రాబిన్ లియు 2018లో వన్‌ప్లస్‌లో చేరారు. తన వ్యక్తిగత ఆసక్తుల (personal passions) కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఇండియాలో వన్‌ప్లస్ వృద్ధికి ఆయన చేసిన కృషిని కంపెనీ కొనియాడింది. అయితే, రాబిన్ లియు నిష్క్రమణతో ఇండియాలో వన్‌ప్లస్ కార్యకలాపాలు నిలిచిపోతాయన్న ఊహాగానాలను కంపెనీ తోసిపుచ్చింది. ‘వన్‌ప్లస్ ఇండియా’ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. వ్యాపార కొనసాగింపులో ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టం చేసింది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, రాబిన్ లియును ‘రియల్‌మీ’ (Realme) సీఈవో స్కై లీకి రిపోర్ట్ చేయాలని ఒప్పో (Oppo) గ్రూప్ కోరినట్లుగా తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ సమాన హోదాలో ఉండేవారు. ఇప్పుడు ఒప్పో సబ్-బ్రాండ్‌ల బాధ్యతలను స్కై లీకి అప్పగించడంతో ఈ మార్పు వచ్చినట్లుగా సమాచారం.

మరోవైపు 2025లో వన్‌ప్లస్ షిప్‌మెంట్లు దాదాపు 32శాతం నుంచి 38శాతం వరకు తగ్గినట్లు మార్కెట్ పరిశోధనా సంస్థలు (CMR, IDC) వెల్లడించాయి. ప్రీమియం విభాగంలో గట్టి పోటీ ఎదురవ్వడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

Next Story