Karnataka : కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం

by Muthe.Rajitha |   (  Updated:2025-06-14 15:53:23  IST  )

కర్ణాటక(Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోనున్నాయి.

Karnataka : కర్ణాటకలో బైక్ టాక్సీలపై నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక(Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోనున్నాయి. ఓలా(Ola), ఉబర్(Uber), రాపిడో(Rapido) వంటి యాప్ ఆధారిత బైక్ టాక్సీ(Bike Taxy Services Ban) సేవలను నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) ఏప్రిల్ 2న ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం జూన్ 16 నుంచి అమల్లోకి రానుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2021లో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ స్కీమ్‌ను 2024 మార్చిలో రద్దు చేసింది. ఈ స్కీమ్ లక్ష్యం కనెక్టివిటీని మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం. అయితే, ఈ స్కీమ్‌లో దుర్వినియోగం జరిగిందని.. ఎలక్ట్రిక్ బైక్‌లకు బదులు వైట్ నంబర్ ప్లేట్‌ (ప్రైవేట్ వాహనాలు) బైక్‌లను ఉపయోగించారని, ఇది మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘనగా ప్రభుత్వం గుర్తించింది.

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఛైర్మన్ నేతృత్వంలోని కమిటీ నివేదిక కూడా బైక్ టాక్సీలు రవాణా వ్యవస్థకు పెద్దగా ఉపయోగపడలేదని తేల్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళగా, విచారణ అనంతరం.. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 93 ప్రకారం బైక్ టాక్సీలకు నియమ నిబంధనలు రూపొందించే వరకు ఈ సేవలు నిలిపివేయాలని చెప్పింది. కోర్టు ఆరు వారాల సమయం (మే 14 వరకు, తర్వాత జూన్ 15 వరకు పొడిగించబడింది) ఇచ్చి, ఆ తర్వాత నిషేధాన్ని అమలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల్లో నిబంధనలు రూపొందించాలని సూచించింది. ఈ నిషేధం వల్ల బెంగళూరులో రూ.10 నుంచి ప్రారంభమయ్యే సరసమైన బైక్ టాక్సీ సేవలపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులు, 75,000 నుంచి 1 లక్ష మంది బైక్ టాక్సీ డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కానుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ల యూనియన్లు ఈ నిషేధాన్ని స్వాగతించగా.. ప్రయాణికులు, బైక్ టాక్సీ డ్రైవర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. రాపిడో, ఓలా, ఉబర్ వంటి సంస్థలు ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి.

Next Story