Ola-Uber: మొబైల్ డివైజ్ ఆధారంగా ఛార్జీలపై ఓలా వివరణ

by S Gopi |

తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓలా, ఉబర్ కంపెనీలు సీసీపీఏకు బదులిచ్చాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: మొబైల్ డివైజ్ ఆధారంగా ఛార్జీలను విధిస్తున్నాయంటూ క్యాబ్ సేవల కంపెనీలైన ఓలా, ఉబర్‌లపై భారీ సంఖ్యలో ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే. దీనిపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) వివరణ ఇవ్వాలని కంపెనీలకు నోటీసులిచ్చింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి ఓలా, ఉబర్ కంపెనీలు సీసీపీఏకు బదులిచ్చాయి. మొబైల్ డివైజ్ ఆధారంగా వినియోగదారులకు వేర్వేరు ఛార్జీలు విధించడంలేదని చెప్పాయి. తమ కస్టమర్లందరికీ ఒకే విధమైన ధరలను అమలు చేస్తున్నాం. మొబైల్ ఆపరేటింగ్ ఆధారంగా వేర్వేరు ఛార్జీలు ఉండవు. ఇదే విషయాన్ని సీసీపీఏకు కూడా తెలియజేశాం. దీనికి సంబంధించి సందేహాలను నివృత్తి చేసేందుకు సీసీపీఏకు సహకరిస్తామని ఓలా ప్రతినిధి ఒకరు తెలిపారు. రైడర్ ఫోన్‌ని బట్టి ధరలు నిర్ణయించము. ఈ అంశంపై సీసీపీఏతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉబర్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. గత కొన్నిరోజుల నుంచి కొందరు కస్టమర్లు ఓలా, ఉబర్ కంపెనీలు ఒకే దూరానికి ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్‌ఫోన్‌లకు వేర్వేరు ఛార్జీలు విధిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో రుజువులతో సహా వీడియోలు పెట్టారు. దీనిపై కేంద్ర వినియోగదారు వ్యవహారాల శాఖ మంత్రి సైతం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సమస్యను సమీక్షించాలని సీసీపీఏను కోరారు.

Next Story