Oil Companies: దేశంలో పుష్కలంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ

by S Gopi |

దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎల్‌పీజీలకు సంబంధించి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చమురు కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి

Oil Companies: దేశంలో పుష్కలంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితుల కోసం డబ్బును దగ్గర ఉంచుకోవడం, కొన్ని వారాలకు సరిపడా నిత్యావసరాలను కొనడం ప్రారంభించారు. ఇదే సమయంలో చాలామంది పెట్రోల్, డీజిల్ కొరత ఉంటుందనే అనుమానాలతో బంకుల్లో క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎల్‌పీజీలకు సంబంధించి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ భయపడనవసరంలేదని చమురు కంపెనీలు శుక్రవారం ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) సంస్థలు వేర్వేరు ప్రకటనలలో తగినంత స్టాక్, సజావుగా సరఫరా చేయగలిగే పరిస్థితులు ఉన్నాయని హామీ ఇచ్చాయి. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేసుకోవడానికి క్యూలో నిలబడి ఉన్న పోస్ట్‌లు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో కంపెనీ అప్రమత్తమయ్యాయి. ఆయా సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోనూ దీనిపై స్పష్టత ఇస్తూ పోస్టులు చేశాయి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అనవసరమైన రద్దీకి కారణం అవ్వొద్దని, సరఫరాను సజావుగా చేపట్టనున్నట్టు వెల్లడించాయి.

Next Story