India: తీవ్ర ఆర్థిక షాక్‌ను ఎదుర్కోనున్న భారత్

by S Gopi |

జూన్ వరకు సంక్షోభం కొనసాగితే ముడి చమురు ధర బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు చేరవచ్చని అన్నారు.

India: తీవ్ర ఆర్థిక షాక్‌ను ఎదుర్కోనున్న భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమైతే, భారత ఆర్థికవ్యవస్థ తీవ్ర ఆర్థిక షాక్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఎంఎఫ్ మాజీ చీఫ్, ప్రముఖ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ హెచ్చరించారు. గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జూన్ వరకు సంక్షోభం కొనసాగితే ముడి చమురు ధర బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు చేరవచ్చని అన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే భారత్‌లో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, రవాణా ఖర్చులు, తయారీ వ్యయాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చమురు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే ఈ ఆందోళనలకు ప్రధాన కారణం. ఉద్రిక్తతలు తగ్గినా సరఫరా వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి కనీసం 2-3 నెలలు పట్టవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా ఉండటం ప్రభుత్వాలకు సాధ్యం కాకపోవచ్చని గోపీనాథ్ అన్నారు. కొంత భారాన్ని ప్రభుత్వం భరిస్తూనే, మిగిలిన భాగం ప్రజలు, కంపెనీలకు బదిలీ కావాల్సి ఉంటుందని చెప్పారు. ఫలితంగా రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడి క్రమంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి రూ. 100 దాటుతుందనే ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. రూపాయి బలహీనపడటం పెద్ద సమస్య కాదని, అది దిగుమతులను నియంత్రించడంలో సహాయపడుతుందని వివరించారు. మారకపు విలువ కంటే ఉద్యోగాలు, వృద్ధి, ద్రవ్యోల్బణ నియంత్రణపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. అయితే, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ భారత్ పూర్తిస్థాయి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు తక్కువేనని గోపీనాథ్ స్పష్టం చేశారు. దేశీయ డిమాండ్, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ ఖర్చులు, మెరుగైన విదేశీ మారక నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు.

Next Story