- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. భారత్ జీడీపీ కంటే ఎక్కువే
ఏఐ ప్రాసెసర్ల కోసం ఆర్డర్లు విపరీతంగా రావడం, ప్రభుత్వం నుంచి ఒప్పందాలు,ఇతర భాగస్వామ్యాల కారణంగా కంపెనీ విలువ పుంజుకుంది

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా చరిత్రను తిరగరాసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగంలో అత్యంత వేగంగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఎన్విడియా మార్కెట్ విలువ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా అమెరికా నాస్దాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ మార్కెట్ క్యాప్ 5 ట్రిలియన్ డాలర్లను తాకింది. ఈ మార్కు దాటిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. దీన్ని మన కరెన్సీలో చూస్తే రూ. 415 లక్షల కోట్లు అవుతుంది. అంతేకాకుండా, ఇది భారత జీడీపీ కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం. అంచనాల ప్రకారం, ప్రస్తుతం భారత జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ)లను తయారుచేసే ఎన్విడియాకు సెల్ఫ్-డ్రైవింగ్ కార్లు, డేటా సెంటర్‌లకు ఇవి కీలకం కావడంతో వీటి డిమాండ్ భారీగా పెరిగింది. మరోవైపు, ఏఐ ప్రాసెసర్ల కోసం ఆర్డర్లు విపరీతంగా రావడం, ప్రభుత్వం నుంచి కూడా బడా ఒప్పందాలు, ఇతర భాగస్వామ్యాల కారణంగా కంపెనీ విలువ పుంజుకుంది. దీంతో ఏఐ రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎన్విడియా ఆదాయం భారీగా పెరిగింది. తద్వారా ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్లను అధిగమించిన ఎన్విడియా, కేవలం మూడు నెలల వ్యవధిలోనే మరో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సంపాదించుకుంది. తద్వారా మైక్రోసాఫ్ట్, యాపిల్ లాంటి ప్రపంచ దిగ్గజాలను దాటి మరీ ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువ కంపెనీగా మారింది. ఇతర కంపెనీలకు సంబంధించి, మైక్రోసాఫ్ట్ 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత యాపిల్ కూడా దాదాపుగా 4 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉండగా, 3.24 ట్రిలియన్ డాలర్లతో ఆల్ఫాబెట్, 1.44 ట్రిలియన్ డాలర్లతో టెస్లా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.






