- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nissan Motor India: భారత మార్కెట్‌ను వీడే ప్రసక్తే లేదు
మార్కెట్లోనే కొనసాగడం కాదు, ఉత్పత్తిని కూడా భారీ ఎత్తున పెంచనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి వెల్లడించారు

దిశ, బిజినెస్ బ్యూరో: భారత మార్కెట్‌ను వీడేది లేదని ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా స్పష్టం చేసింది. ఇటీవల రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా(ఆర్ఎన్ఏఐపీఎల్)లో రెనాల్ట్ గ్రూప్ సంస్థ 100 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిస్సాన్ మోటార్ ఇండియా భారత మార్కెట్‌ను వీడుతుందనే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కంపెనీ ఊహాగానాలకు చెక్ పెట్టింది. మార్కెట్లోనే కొనసాగడం కాదు, ఉత్పత్తిని కూడా భారీ ఎత్తున పెంచనున్నట్టు కంపెనీ సీనియర్ అధికారి వెల్లడించారు. ముఖ్యంగా 2027 నాటికి కొత్తగా మూడు మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స బుధవారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఒక మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ), రెండు ఎస్‌యూవీలను 2026-2027 ప్రారంభంలోపు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం నిస్సాన్ బ్రాండ్‌కు మార్కెట్ వాటా కంటే ఎక్కువ అమ్మకాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కొత్త మోడళ్లను కస్టమర్లకు పరిచయం చేయడం ద్వారా అమ్మకాలతో పాటు మార్కెట్ వాటాను కూడా వీలైనంత ఎక్కువ సొంతం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్ఎన్ఏఐపీఎల్‌లో తమ వాటా విక్రయం తర్వాత భారత మార్కెట్ నుంచి వెళ్లిపోతున్నామనే ఊహాగానాలు వినిపించాయి. అలాంటి పుకార్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కస్టమర్లు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయని సౌరభ్ వివరించారు. కొత్తగా విడుదల చేయబోయే ఎంపీవీ మోడల్‌ను 2026 మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తామని, ఆ తర్వాత ద్వితీయార్థం నాటికి ఐదు సీట్ల ఎస్‌యూవీ, 2027 ప్రారంభంలో ఏడు సీట్లతో కూడిన ఎస్‌యూవీని అందిస్తామని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం భారత మార్కెట్లో కంపెనీ మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇటీవల మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 27,881 కార్లను విక్రయించింది. దేశీయ అమ్మకాల్లో 7.5 శాతం తగ్గినప్పటికీ, భారత్ నుంచి ఎగుమతుల్లో 66 శాతం పెరిగి 71,334 వాహనాలను ఇతర మార్కెట్లకు పంపించింది.






