- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్సూరెన్స్ కస్టమర్లకు ఊరట.. కట్టడికి రంగంలోకి ఐఆర్‌డీఏఐ!
No More Hidden Traps: IRDAI Cracks Down on 'Dark Patterns' in Insurance

దిశ, బిజినెస్ బ్యూరో : దేశంలో బీమా కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్య పరిష్కారానికి నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ రంగంలోకి దిగింది. వినియోగదారులు తాము వద్దనుకున్నప్పటికీ తప్పుదోవ పట్టించేలా ఉండే ఇన్సూరెన్స్ యాప్ డిజైన్, డార్క్ ప్యాటర్న్స్ కట్టడికి బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) చర్యలు ప్రారంభించింది. అన్ని బీమా సంస్థలు, అగ్రిగేటర్లను డార్క్ ప్యాటర్న్‌లను గుర్తించి తొలగించాలని ఆర్‌డీఏఐ ఆదేశించింది. ఆన్‌లైన్‌లో బీమా కొనుగోలు చేసేటప్పుడు ప్రతి పదిమందిలో 8 మందికి పైగా ఇటువంటి పద్ధతులను ఎదుర్కొంటున్నారని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో గత 36 నెలలుగా లోకల్ సర్కిల్స్ కస్టమర్ల అభిప్రాయాలు, ఏఐ ఆధారిత సిమ్యులేషన్, వ్యాలిడేషన్ ఆధారంగా డార్క్ ప్యాటర్న్‌లపై పరిశోధన చేసి ఆ సమాచారాన్ని దేశంలోని వివిధ నియంత్రణ సంస్థల దృష్టికి తీసుకువెళ్ళింది. 341 జిల్లాల్లో 87,000కు కస్టమర్ల నుంచి లోకల్‌సర్కిల్స్ అధ్యయనంలో డార్క్ ప్యాటర్న్స్ సమస్య పరిధి, తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
డార్క్ ప్యాటర్న్స్ అంటే..
డార్క్ ప్యాటర్న్స్ అంటే.. కస్టమర్లు తాము వద్దనుకున్నప్పటికీ అంగీకరించేలా వారిని తప్పుదోవ పట్టించే పద్ధతులు. డార్క్ ప్యాటర్న్‌లు అనేవి యాప్‌లు, వెబ్‌సైట్‌లలో ఉపయోగించే ట్రిక్స్. వీటివల్ల కస్టమర్లను వారికి పూర్తిగా అర్థం కాకుండా సమాచారం ఉండటం, వారికి అవసరం లేకపోయినా పాలసీని కొనసాగించే చేసే పద్ధతులు. ఉదాహరణకు.. క్యాన్సిల్ బటన్ చిన్నగా ఉండటం, సబ్‌స్క్రైబ్ బటన్ పెద్దగా ఉండటం. అలాగే అదనపు చార్జీలను చివర్లో మాత్రమే చూపించడం.
నివారణ చర్యలు..
సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ)తో సహా వివిధ నియంత్రణ సంస్థలు డార్క్ ప్యాటర్న్‌ల పరిష్కారాన్ని తప్పనిసరి చేశాయి. సీసీపీఏ 13 డార్క్ ప్యాటర్న్‌లను గుర్తించి వాటిని అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా వర్గీకరించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్‌బీఐ ‘బాధ్యతాయుత వ్యాపార ప్రవర్తన సవరణ ఆదేశాలు-2026’ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పుడు డార్క్ ప్యాటర్న్స్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్న రెండో నియంత్రణ సంస్థగా ఐఆర్‌డీఏఐ నిలిచింది. ఐఆర్‌డీఏఐ ఆదేశాల ప్రకారం.. వినియోగదారులను తప్పుదోవ పట్టించే తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోని యూజర్ ఇంటర్‌ఫేస్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలు 15 రోజుల్లోగా సీసీపీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. డార్క్‌ప్యాటర్న్స్‌ను తొలగించడానికి నెల రోజుల్లోగా ప్రణాళికలను సమర్పించాలని ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలను కోరింది.
తప్పుదోవ పట్టించే అంశాలివే..
- బీమా కొన్న తర్వాత పాలసీలను రద్దు చేయడంలో ఇబ్బంది పడుతున్నట్లు 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. గత రెండేళ్లలో ఈ పరిస్థితి 61 శాతం నుంచి 80 శాతానికి పెరిగింది.
- 90 శాతం మంది నిరంతరం కాల్స్, ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్స్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పాలసీ క్యాన్సిల్ చేసేందుకు ప్రయత్నించిన తర్వాత కూడా ఇది కొనసాగింది.
- 85 శాతం మంది బలవంతంగా వ్యక్తిగత డేటాను ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. అవసరం లేకుండా కాల్స్, ఎస్సెమ్మెస్ బెడద, డేటా దుర్వినియోగం వంటి ఘటనలు 57 శాతం నుంచి 85 శాతానికి పెరిగాయి.
- 82 శాతం మంది ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చిన యాడ్స్‌కు వాస్తవంలో ధరలకు చాలా తేడా ఉంటోంది.
- 65 శాతం మంది పాలసీ ఖర్చుల గురించి ముందుగా చెప్పట్లేదని, తర్వాత ఆలస్యంగా ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.
కస్టమర్లపై ప్రభావం..
- దాచిన చార్జీలు, తప్పుదారి పట్టించే ధరల కారణంగా ఆర్థిక నష్టాలు.
- స్పామ్ కాల్స్, గోప్యతా ఉల్లంఘనలు.
- పూర్తి సమాచారం, అనుమతి లేకుండా పాలసీలను అమ్మడం.






