Energy Security: ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

by S Gopi |

నిల్వలు రోజూ భర్తీ అవుతున్నాయి. ప్రధానంగా ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Energy Security: ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతకు సంబంధించి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో తగినంత ముడి చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. దేశంలో ఇంధన కొరత విషయంలో ఆందోళనలకు తెర దించుతూ పెట్రోల్, డీజిల్ గురించి ఎలాంటి నిబంధనలు విధించడంలేదని, దేశంలో కావాల్సిన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని వెల్లడించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి, ప్రజలు, పరిశ్రమలకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. దేశ ఇంధన భద్రత గురించి ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నాం, నిల్వలు రోజూ భర్తీ అవుతున్నాయి. ప్రధానంగా ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ, ముడి చమురు సరఫరాకు ఎలాంటి సమస్యా లేదు. ప్రాధాన్యతా రంగాలకు గ్యాస్ సరఫరా నిరంతరం అందించడానికి గెయిల్ అవసరమైతే ఫోర్స్ మెజ్యూర్ ప్రకటించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నిబంధన కింద అనూహ్య పరిస్థితులు ఎదురైతే ఒప్పందాన్ని పాజ్ చేయవచ్చు. భారత్‌కు పంపించాల్సిన ఎల్ఎన్‌జీ విషయంలో ఖతార్ ఇదే విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం మనకు ఖతార్ రోజుకు 60 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎండీ) గ్యాస్‌ను సరఫరా చేస్తోంది. అలాగే, ప్రపంచ అవసరాల్లో 20 శాతం మేర సరఫరా చేస్తోంది. అయితే, భారత్‌కు మొత్తం 195 ఎంఎస్‌సీఎండీ) దిగుమతులు అవసరం. కాబట్టి, మనదేశానికి కావాల్సిన గ్యాస్ కోసం ఇతర మార్కెట్లనూ అన్వేషిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇతర మార్గాలు

ప్రస్తుత పరిస్థితుల మధ్య భారత్ ప్రత్యామ్నాయ వనరులపైనా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాలు గ్యాస్ సరఫరాకు అంగీకరించాయి. కొత్తగా జరిగిన ఒప్పందాల కింద యూఏఈ, అమెరికా నుంచి కూడా సమీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఒక దేశంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. అంతర్జాతీయంగా ఇబ్బందులు తలెత్తకుండా పలు కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం కారణంగా పెరుగుతున్న నౌకల బీమా సౌకర్యాలపైనా అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నౌకలకు తక్కువ ధరకు బీమా కల్పించనున్నట్లు స్పష్టం చేశారు.

Next Story