Tax: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 19.43 లక్షల కోట్లు

by S Gopi |

ఎక్కువ మంది పన్నులు సరిగ్గా చెల్లించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్లనే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది.

Tax: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ. 19.43 లక్షల కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి రూ. 19.43 లక్షల కోట్లకు పైగా వసూలైనట్లు ఆదాయ పన్ను విభాగం బుధవారం తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 9.4 శాతం వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది పన్నులు సరిగ్గా చెల్లించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్లనే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 14.51 శాతం పెరిగి రూ. 8.90 లక్షల కోట్లకు చేరుకోగా, వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) సహా కార్పొరేటేయేతర సంస్థల నుంచి వచ్చే పన్నులు 5.91 శాతం పెరిగి రూ. 10.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు రూ. 50,279 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో పన్ను రీఫండ్లు 18.82 శాతం తగ్గి రూ. 3.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిఫండ్‌ల సర్దుబాటు చేయడానికి ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి 4.09 శాతం పెరిగి రూ. 22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సవరించిన అంచనాలలో ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్లను రూ.24.84 లక్షల కోట్లుగా అంచనా వేసింది.

Next Story