Infosys Narayana: పేదరిక నిర్మూలనకు ఉద్యోగాలివ్వాలి, ఉచితాలు కాదు: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

by S Gopi |   (  Updated:2025-03-12 18:28:08  IST  )

ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించడం ద్వారా పేదరికం నశిస్తుందన్నారు.

Infosys Narayana: పేదరిక నిర్మూలనకు ఉద్యోగాలివ్వాలి, ఉచితాలు కాదు: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉద్యోగుల పని గంటలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాల గురించి మాట్లాడుతూ.. పేదరిక సమస్యను ఉచితాలు పరిష్కరించవని, కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగాల కల్పన ద్వారా మాత్రమే నిర్మూలించగలమని అభిప్రాయపడ్డారు. బుధవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఉచితాలు ఇవ్వడం ద్వారా ఏ దేశం కూడా పేదరికాన్ని తొలగించలేకపోయింది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించడం ద్వారా పేదరికం నశిస్తుందన్నారు.

ఇదే కార్యక్రమంలో దేశంలో ఏఐ టెక్నాలజీ పురోగతి గురించి స్పందించిన నారాయణ మూర్తి.. దేశంలో కృత్రిమ మేధస్సు(ఏఐ) చుట్టూ జరుగుతున్న హైప్ గురించి కీలక హెచ్చరికలు చేశారు. ఏఐ పేరుతో ప్రచారంలో ఉన్న అనేక వ్యవస్థలు కేవలం సాంప్రదాయ ప్రోగ్రామ్‌లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏఐగా పిలుస్తున్న వాటిలో చాలావరకు వెర్రి, పాత ప్రోగ్రామింగ్ అని గమనించాను. దేశంలో ప్రతి విషయంలోనూ ఏఐ గురించి మాట్లాడటం ఫ్యాషన్‌గా మారింది. సాధారణ ప్రోగ్రామ్‌లను ఏఐగా ప్రచారం చేస్తున్నారు. నిజమైన ఏఐ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వంటి రెండు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. సాంకేతికత పురోగతి సాధించిన ప్రతిసారి కొన్ని ఉద్యోగాలు తొలగించాల్సి వస్తుంది. అయితే సహాయక పద్ధతిలో వాటిని కొనసాగిస్తే, ఆర్థిక వృద్ధిని కొనసాగించవచ్చు. ఏఐ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఏఐ కొన్ని ఆటోమేషన్ ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యం కలిగి ఉంటుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఉదాహరణకు, రవాణా, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఏఐని ఉపయోగిస్తే, దానివల్ల ఆయా కంపెనీల విస్తరణకు దారి తీస్తుంది, ఉద్యోగాలను సృష్టిస్తాయని వెల్లడించారు.

READ MORE ...

LIC: ఎల్ఐసీలో 2-3 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం


Next Story