Myntra: గ్లోబల్ మార్కెట్లోకి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా

by S Gopi |

అంతర్జాతీయంగా మింత్రా బ్రాండ్‌ను సమర్థవంతంగా కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి

Myntra: గ్లోబల్ మార్కెట్లోకి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మింత్రా గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. విస్తరణలో భాగంగా సింగపూర్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. సింగపూర్‌లో సుమారు 6.5 లక్షల మంది భారతీయులు నివశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగపూర్ వేదికంగా గ్లోబల్ మార్కెట్లలోకి అడుగుపెట్టవచ్చని, తద్వారా మరింత వేగవంతమైన వృద్ధికి, కొత్త వినియోగదారులను పొందేందుకు వీలవుతుందని మింత్రా భావిస్తోంది. భవిష్యత్తులో అంతర్జాతీయంగా మింత్రా బ్రాండ్‌ను మరింత సమర్థవంతంగా కొనసాగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సింగపూర్ నుంచి దాదాపు 30,000 మంది కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను సందర్శిస్తున్నారని మింత్రా సీఈఓ నందితా సిన్హా చెప్పారు. ప్రధానంగా భారతీయుల అవసరాలను తీర్చే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్‌లను అంతర్జాతీయంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. మింత్రా గ్లోబల్ వెబ్‌సైట్‌లో దుస్తులు, పాదరక్షలు, గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులకు సంబంధించి 100కి పైగా భారతీయ బ్రాండ్లను విక్రయించనుంది. మింత్రా గ్లోబల్‌లో ఆర్డర్ చేసిన వస్తువులను భారత్ నుంచే సరఫరా చేస్తారు, సగటున 4-7 రోజుల్లోగా డెలివరీ అందిస్తారు. దీనికోసం థర్డ్-పార్టీ క్రాస్-బార్డర్స్ లాజిస్టిక్స్ సేవలను వినియోగించనున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ అనుబంధంగా పనిచేస్తోంది. మింత్రా ప్లాట్‌ఫామ్‌లో 7 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉండగా, 9,700 కంటే ఎక్కువ బ్రాండ్లను విక్రయిస్తోంది.

Next Story