- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI For Good: గ్లోబల్ ఏఐ కమిషన్‌లో నలుగురు భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రభుత్వాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 40 మందికి పైగా ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను విస్తరించడం, బాధ్యతాయుతంగా వినియోగించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన 'ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ 'లో నలుగురు భారతీయ వ్యాపార దిగ్గజాలు వ్యవస్థాపక సభ్యులుగా చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఫెడెక్స్ డేటావర్క్స్ ప్రెసిడెంట్ విశాల్ తల్వార్ ఈ జాబితాలో ఉన్నారు. రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) సెక్రటరీ జనరల్ డోరీన్ బోగ్డాన్-మార్టిన్ ఈ కమిషన్‌ను ప్రకటించారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలకు చెందిన 40 మందికి పైగా ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ, క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్ తదితరులు కూడా ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రయోజనాలు కొన్ని దేశాలకే పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా చేరేలా విధానాలు రూపొందించడం ఈ కమిషన్ ప్రధాన లక్ష్యం. ఏఐ అభివృద్ధి, అమలు, పాలసీ రూపకల్పన, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై సభ్యులు కలిసి పనిచేయనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 220 కోట్ల మంది ఇంకా డిజిటల్ సేవలకు దూరంగా ఉన్నారని, ఈ అంతరాన్ని తగ్గించడం కూడా కమిషన్ కీలక లక్ష్యాల్లో ఒకటని నిర్వాహకులు తెలిపారు. ఏఐ అంతర్జాతీయంగా ప్రజలందరికీ ఉపయోగపడాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమలు, అంతర్జాతీయ సంస్థలు కలిసి పనిచేయాల్సిందేనని కమిషన్ సహ-అధ్యక్షులు పేర్కొన్నారు. ఈ కమిషన్ తొలి సమావేశం జూలై 7 నుంచి 10 వరకు జెనీవాలో నిర్వహించనున్నారు.






