- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mukesh Ambani: ఆరేళ్లుగా ముఖేష్ అంబానీ జీతం 'సున్నా'
కోవిడ్ మహమ్మారి సమయం(2020)లో స్వచ్ఛందంగా జీతాన్ని వదులుకున్న ఆయన, అదే నిర్ణయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ వరుసగా ఆరో ఏడాదీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎటువంటి జీతం తీసుకోలేదు. కోవిడ్ మహమ్మారి సమయం(2020)లో స్వచ్ఛందంగా జీతాన్ని వదులుకున్న ఆయన, అదే నిర్ణయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించారు. రిలయన్స్ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. షేర్లపై లభించే డివిడెండ్లు మాత్రమే ఆయన ఆదాయానికి ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయి. రిలయన్స్ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో, ఆయన పేరుతో ఉన్న 1.61 కోట్ల షేర్ల ద్వారా రూ.9.66 కోట్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాల ద్వారా దాదాపు రూ.3,987 కోట్ల డివిడెండ్ ఆదాయం లభిస్తుంది. బడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సమయంలో, అంబానీ జీతాన్ని పూర్తిగా వదులుకోవడం 'కార్పొరేట్ గవర్నెన్స్'కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంబానీ జీతం తీసుకోనప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. 2025-26లో కంపెనీ రూ.95,754 కోట్ల నికర లాభాలను నమోదు చేయగా, మార్కెట్ క్యాప్ రూ.18.19 లక్షల కోట్లకు చేరుకుంది. గతంలో కూడా 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ వార్షిక పారితోషికాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. ఇదే సమయంలో రిలయన్స్ టాప్ మేనేజ్‌మెంట్‌కు చెల్లించిన పారితోషికాల్లో కూడా పెద్ద మార్పులు కనిపించలేదు. అంబానీ బంధువులు నిఖిల్, హితల్ మెస్వానీలు ఒక్కొక్కరు రూ.25 కోట్ల చొప్పున అందుకోగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ జీతం రూ.20.58 కోట్లకు పెరిగింది. అంబానీ వారసులు ఆకాష్, ఈషా మొదట్లో కేవలం సిట్టింగ్ ఫీజు, కమీషన్ మాత్రమే తీసుకోగా, ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితుడైన అనంత్ అంబానీ రూ.12.17 కోట్ల పారితోషికం అందుకున్నారు. 2029 వరకు రిలయన్స్ చైర్మన్‌గా కొనసాగనున్న ముఖేష్ అంబానీ, అప్పటివరకు జీతం తీసుకోకూడదని నిర్ణయించినట్టు వెల్లడించారు.






