RBI: మరింత తగ్గనున్న ఈఎంఐ భారం

by S Gopi |

ప్రధానంగా ఫ్లోటింగ్ రేటుపై ఇళ్ల రుణాలు తీసుకున్న వారికి కొత్త వడ్డీ రేటు భారీ ఊరట కానుంది.

RBI: మరింత తగ్గనున్న ఈఎంఐ భారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంచనాలకు తగినట్టుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక రేట్లను తగ్గించింది. అయితే, ఈసారి గతం కంటే రెట్టింపు 50 బేసిస్ పాయింట్లు తగ్గించి కీలక రేపో రేటును 5.50 శాతానికి చేర్చింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంట్రీ-లెవల్ ఇళ్ల కొనుగోలుదారులకు ఇళ్లను కొనేందుకు ప్రోత్సాహం లభించనుంది. గత రెండేళ్లుగా ఈ విభాగంలోని ఇళ్లకు గిరాకీ నెమ్మదించిన నేపథ్యంలో తాజా ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు కొంత సానుకూల ప్రభావం చూపనుంది. ప్రధానంగా ఫ్లోటింగ్ రేటుపై ఇళ్ల రుణాలు తీసుకున్న వారికి కొత్త వడ్డీ రేటు భారీ ఊరట కానుంది. ఈ నెల 4-6 తేదీల మధ్య జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమవేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగి వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి, ఏప్రిల్ సమావేశాల్లో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి రెపో రేటులో 1 శాతం తగ్గించింది. ఈ నిర్ణయంతో గృహ మార్కెట్‌తో పాటు వాహన, వ్యక్తిగత రుణాలపై కూడా వడ్డీ భారం తగ్గనుంది. వ్యవస్థలో వినియోగం పెరుగుతుంది. రుణాలు తీసుకునే వారిని మెరుగైన క్రెడిట్ యాక్సెస్ లభించడమే కాకుండా ఆర్థిక వృద్ధి తోడ్పడుతుంది. ఇదే సమయంలో ఎంపీసీ సభ్యులు పాలసీ వైఖరిని సర్దుబాటు నుంచి స్థిర విధానానికి మార్చాలని నిర్ణయించారు.

తగ్గనున్న ఈఎంఐ భారం

ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడంతో రుణాలు తీసుకున్న వారు తమ ఈఎంఐ భారం తగ్గించుకునే వీలుంటుంది. లేదా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఎక్కువ గడువు తీసుకోవచ్చు. ఉదాహరణకు, 2025, జనవరిలో 20 ఏళ్లకు 8.50 శాతం వడ్డీతో రూ. 50 లక్షల లోన్ తీసుకుంటే, దానికి రూ. 43,391 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మూడు దశల్లో 1 శాతం వడ్డీ రేటు తగ్గింపు వల్ల ఈఎంఐ రూ. 40,280కి చేరుతుంది. వడ్డీ తగ్గింపు కారణంగా ఈఎంఐ భారం రూ. 3,111 మేర తగ్గుతుంది. 20 ఏళ్ల కాలానికి దాదాపు రూ. 7.46 లక్షలకు పైగా ఆదా అవుతుంది.

మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.75 శాతంగా నిర్ణయించినట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ పటిష్టంగా, స్థిరంగా ముందుకెళ్తోంది. వృద్ధి వేగవంతంగా ఉండటమే కాకుండా పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను భారత్ కల్పిస్తోందని గవర్నర్ తెలిపారు. క్రిప్టో కరెన్సీల విషయంలో మరోసారి రెడ్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ సంజయ్ మల్హోత్రా. వాస్తవానికి డిజిటల్ ఆస్తులు ఆర్థిక స్థిరత్వం, ద్రవ్య విధానాలకు ప్రతికూలమని అన్నారు. క్రిప్టోకు సంబంధించి కొత్త డెవలప్‌మెంట్ ఏమీ లేదు. ప్రభుత్వ కమిటీ దీన్ని చూసుకుంటోంది.

ద్రవ్యోల్బణం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు దిగి రావడంతో ద్రవ్యోల్బణం 4 శాతం నుంచి 3.7 శాతానికి చేరుతుంది. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.5 శాతం నమోదవుతుందని అంచనా. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 6.5 శాతం, రెండో త్రైమాసికంలో 6.7 శాతం, మూడో త్రైమాసికంలో 6.6 శాతం, నాలుగో త్రైమాసికంలో 6.4 శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని గవర్నర్ వివరించారు.

ఇదే సమయంలో బ్యాంకుల వద్ద నగదు నిల్వల నిష్పత్తిని 100 బేసిస్ పాయింట్లు తగ్గించామని, బ్యాంకు నిధులను రూ. 2.50 లక్షల కోట్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. దీనివల్ల బ్యాంకులు మరిన్ని రుణాలు ఇచ్చేందుకు వీలవుతుంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి వ్యవస్థలోకి రూ. 9.5 లక్షల కోట్ల నిధులను చొప్పించామని గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న 691.5 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ మారకపు నిల్వలు 11 నెలల దిగుమతులకు సరిపోతాయని చెప్పారు.

గోల్డ్ లోన్స్‌పై కొత్త మార్గదర్శకాలు

శుక్రవారం నాటి ప్రకటనలోనే ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, గోల్డ్ లోన్లకు సంబంధించి త్వరలో కొత్త మార్గదర్శకాలు ఇస్తామని స్పష్టం చేశారు. త్వరలో వాడిని విడుదల చేస్తామన్నారు. ముఖ్యంగా రూ. 2.50 లక్షల కంటే తక్కువ రుణం తీసుకోవాలని భావించే వారికి లోన్-టూ-వ్యాల్యూ 75 శాతం నుంచి 85 శాతానికి పెంచే నిర్ణయం ఉంటుందన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రైతులు, చిన్న మొత్తం రుణ గ్రహీతల కోసం బంగారు రుణాలపై నిబంధనలను సవరించాలని కోరిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగానే ఆర్‌బీఐ సవరణలు చేయనుంది.

Next Story