Mother Dairy: పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ

by S Gopi |   (  Updated:2025-04-29 17:34:39  IST  )

సవరించిన ధరలు బుధవారం(ఏప్రిల్ 30) నుంచి అమలవుతాయని పేర్కొంది.

Mother Dairy: పాల ధరలు పెంచిన మదర్ డెయిరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పాలపంపిణీ సంస్థ మదర్‌ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని రకాల పాల ధరలు లీటర్‌కు రూ. 2 వరకు పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, సవరించిన ధరలు బుధవారం(ఏప్రిల్ 30) నుంచి అమలవుతాయని పేర్కొంది. గత కొన్ని నెలలుగా లీటర్‌కు రూ. 4-5 చొప్పున పాల సేకరణకు అధిక ఖర్చు అవుతోందని, ఈ కారణంగానే ధరలు పెంచుతున్నట్టు మదర్ డెయిరీ వివరించింది. ఈ ఏడాది వేసవి త్వరగా ప్రారంభం కావడం, తద్వారా పాల ఉత్పత్తి, సరఫరాపై ప్రభావం కారణంగా సేకరణ ఖరీదు ఎక్కువగా ఉందని మదర్ డెయిరీ ప్రతినిధి చెప్పారు. కొత్త ధరలు మదర్ డెయిరీ ఆధ్వర్యంలోని అన్ని మార్కెట్‌లకు వర్తిస్తాయి. కొత్త ధరలు.. బల్క్ వెండెడ్ టోన్డ్ మిల్క్ ఇప్పుడు లీటరుకు రూ. 54 నుంచి రూ. 56కి పెరిగింది. అర లీటర్ ప్యాక్‌లోని ప్రీమియం ఫుల్ క్రీమ్ (అల్ట్రా) పాల ధర రూ. 38 నుంచి రూ. 39కి చేరుకుంది. ఫుల్ క్రీమ్ పాల ధర లీటర్ ప్యాక్ రూ.68 నుంచి రూ.69కి, అర లీటర్ ప్యాక్ రూ.34 నుంచి రూ.35కి పెరిగింది. టోన్డ్ మిల్క్ ధర రూ.56 నుంచి రూ.57కి, గతంలో రూ.28గా ఉన్న అర లీటర్ రూ.29కి చేరింది. డబుల్ టోన్డ్ (లైవ్ లైట్) పాలు ఇప్పుడు లీటరుకు రూ.51, అర లీటర్ ప్యాక్ ధర రూ.25 నుంచి రూ.25కి పెరిగింది. ఆవు పాలు లీటరుకు రూ.57 నుంచి రూ.59కి, అర లీటర్ ప్యాక్‌ రూ.29 నుంచి రూ.30కి పెరగనుంది.

Next Story