Jobs: ఈ ఏడాది ఉద్యోగాలు మారడం ఖాయం

by S Gopi |

మరో 12 నెలల్లోపు వేరే కంపెనీలను వెతుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Jobs: ఈ ఏడాది ఉద్యోగాలు మారడం ఖాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేస్తున్న సంస్థ నుంచి లభించే ప్రయోజనాలు, ఉద్యోగికి ఉండే విలువ ఆధారంగా కొత్త తరం ఉద్యోగం పట్ల భిన్నమైన వైఖరిని కలిగి ఉంది. తాజా ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ నిర్వహించిన సర్వేలో, దేశీయంగా 80 శాతం కంటే ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగాలను మారడానికి సిద్ధంగా ఉన్నారు. 'ఎంప్లీయి సెంటిమెంట్ స్టడీ' పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం, మరో 12 నెలల్లోపు వేరే కంపెనీలను వెతుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ధోరణి అంతర్జాతీయంగా 60 శాతం మందిలో ఉందని అయాన్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులపై అయాన్ సంస్థ సర్వే నిర్వహించింది. జెడ్‌ జనరేషన్‌ (1990-2000 మధ్య పుట్టిన వ్యక్తులు) ఉద్యోగుల్లో చాలా మంది ఉద్యోగం మారడానికి ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం మారేందుకు.. వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోలేకపోవడం, వేతనం సరిపోవట్లేదని, మెరుగైన కెరీర్‌ కోసం ఉద్యోగం మారుతున్నట్టు చెప్పారు. కొత్త ఉద్యోగాలు వెతికే క్రమంలో పని సమయం అనుకూలంగానే ఉండాలనే లక్ష్యంతో వెతుకుతున్నట్టు ఉద్యోగాలు చెప్పారు. భారత్‌లో 7 శాతం మంది ఉద్యోగులు సంస్థలో తమకు తక్కువ విలువ ఉందనే భావనలో ఉన్నారు, ఈ అభిప్రాయం అంతర్జాతీయంగా 13 మంది ఉద్యోగుల్లో ఉంది. 76 శాతం మంది ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న వాటి కంటే మెరుగైన ప్రయోజనాలు ఉండాలని ఆశిస్తున్నారు.

కొంతకాలం క్రితం వరకు తక్కువ కంపెనీలు మాత్రమే వెల్‌నెస్, హెల్త్‌కేర్ ప్రోగ్రామ్‌లు, యాజమాన్య బ్రాండింగ్, ఉద్యోగి విలువ ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించేవి. అయితే, కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ అంశాలు ఉద్యోగికి హక్కుగా లభించే వాటి జాబితాలో చేరాయని అయాన్ టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా ప్రతినిధి నితిన్ సేథీ అన్నారు. ఇటువంటి ప్రయోజనాలు తగ్గిన కంపెనీల వైపు ఉద్యోగులు ఆసక్తి చూపించడంలేదు. రానున్న దశాబ్ద కాలంలో ఎక్కువ సంఖ్యలో కంపెనీలు కూడా ఇటువంటి ప్రయోజనాలను అందించడం ద్వారా తమ తమ రంగాల్లో ఉత్తమ కంపెనీగా ఎదిగేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. అయాన్ కంపెనీ అమెరికాతో, యూకేతో పాటు చైనా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో 9,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను సేకరించడం ద్వారా వివరాలను నివేదికలో పొందుపరిచింది. భారత్‌లోని 10 శాతం కంపెనీ ఉద్యోగులు తమ యాజమాన్యం ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధి, శిక్షణలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తు పనికి సిద్ధం చేస్తున్నారనే నమ్మకం లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, కృత్రిమ మేధస్సు(ఏఐ)లో తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఉద్యోగులు అధిక ఆసక్తిని చూపిస్తున్నారని నివేదిక పేర్కొంది.

Next Story