NSO: వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆదాయ సర్వే నిర్వహించనున్న కేంద్రం

by S Gopi |

కుటుంబాల సగటు ఆదాయాన్ని అంచనా వేసేందుకు సర్వే ఉపకరిస్తుందని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

NSO: వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆదాయ సర్వే నిర్వహించనున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రజల ఆదాయ వివరాల సేకరణకు అధికారిక సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2026, ఫిబ్రవరి నుంచి గృహ ఆదాయ సర్వే(హెచ్ఐఎస్)ని ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివశించే కుటుంబాల సగటు ఆదాయాన్ని అంచనా వేయడం, జీవన ప్రమాణాలు, ఆదాయ అసమానతలు, పేదరిక స్థాయికి సంబంధించి స్పష్టమైన అవగాహనకు ఈ సర్వే ఉపకరిస్తుందని మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు దేశంలో కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై ప్రాథమిక వనరుగా ఉన్న గృహ వినియోగ వ్యయ సర్వేను కొత్తగా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) నిర్వహించే హెచ్ఐఎస్ సర్వే భర్తీ చేయనుంది. వినియోగ వ్యయ సర్వే ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ఆదాయంపై సూక్ష్మ వివరాలను సేకరించదు. హెచ్ఐఎస్ ఇందుకు కీలక అడుగుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

గతంలోనూ జరిగాయ్

ఇదివరకు ఆదాయ సర్వేలు అనేక సవాళ్లను ముందుంచాయి. ఎన్ఎస్ఓ 1955, 1959 సమయంలో గృహ ఆదాయ డేటాను సేకరించడానికి ప్రయత్నించింది. కానీ, అవి ప్రజల్లోకి రాలేదు. ఆ తర్వాత 2003లో రైతు కుటుంబాల పరిస్థితులను అంచనా వేసే సర్వే(ఎస్ఏఎస్) గ్రామీణ ఆదాయ డేటాకు అతిపెద్ద వనరుగా మారినప్పటికీ, అది వ్యవసాయ కుట్ముంబాలకే పరిమితం అయింది. 1960లలో ఎన్ఎస్ఓ ఇంటిగ్రేటెడ్ హౌస్‌హోల్డ్ సర్వేలు రసీదులు, చెల్లింపులపై డేటాను సేకరించాయి. కానీ ఈ ఆదాయ అంచనాలు మొత్తం వినియోగం, పొదుపు గణాంకాల కంటే తక్కువగా ఉన్నాయి. ఆదాయాన్ని ఖచ్చితంగా కొలవడంలో ఉన్న ఇబ్బందులు మరోసారి ఉత్పన్నమయ్యాయి. 1983–84లో మరొక పైలట్ సర్వే ఆదాయ డేటాను సేకరించే ప్రయత్నాలు చేసినప్పటికీ, పూర్తి స్థాయి సర్వే జరగలేదు.

ప్రత్యేక టీమ్ పర్యవేక్షణ

కొత్త హెచ్ఐఎస్ సర్వేకు మార్గనిర్దేశం చేయడానికి, మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేసిన సుర్జిత్ ఎస్ భల్లా అధ్యక్షతన ఒక సాంకేతిక నిపుణుల బృందం (టీఈజీ)ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ), ఎన్ఎస్ఈ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి అగ్ర సంస్థల నుంచి ప్రముఖ ఆర్థికవేత్తలు ఉంటారు. ఈ సమగ్ర గృహ ఆదాయ సర్వే భారత డేటా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, ఆదాయ అసమానత, పేదరికం, ఆర్థిక అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి విధాన రూపకర్తలకు మెరుగైన సాధనాలను అందిస్తుందని భావిస్తున్నారు.

Next Story