Millionaires: దేశం వదిలిపోతున్న సంపన్నులు

by S Gopi |   (  Updated:2025-06-25 15:06:47  IST  )

గతేడాది 4,000 కంటే ఎక్కువమంది మిలియనీర్లు భారత్‌ను వీడారు

Millionaires: దేశం వదిలిపోతున్న సంపన్నులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ నుంచి ప్రతి ఏడాది వేలాది సంఖ్యలో మిలియనీర్లు ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఈ ఏడాది కూడా కనీసం 3,500 మంది వరకు దేశం వదిలి వెళ్లిపోయే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక పేర్కొంది. వారిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటారని నివేదిక వెల్లడించింది. గతేడాది 4,000 కంటే ఎక్కువమంది మిలియనీర్లు భారత్‌ను వీడగా, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ మిలియనీర్ల వలసల విషయంలో యూకే, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా.

సంపన్నుల వలస ఎందుకు?

కొన్ని దేశాల్లో ఆర్థికంగా గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాలు ఉద్యోగాల సృష్టి, ప్రతిభ కోసం మాత్రమే కాకుండా కొత్తగా సంపదను పెంచే, ఎక్కువ సంఖ్యలో మిలియనీర్లు ఉండాలనే దానికోసం పోటీ పడుతున్నాయని నివేదిక పేర్కొంది. అందుగ్గానూ తమ దేశానికి వచ్చే సంపన్నులకు వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. సుమారు 63 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో యూఏఈ సంస్కరణల ద్వారా ప్రపంచ సంపన్నులకు కేంద్రంగా ఎదుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా

సంపన్నులను కోల్పోవడంతో భారత్‌తో పాటు అనేక దేశాలు ముందున్నాయి. 2025లో కనీసం 1,42,000 మంది మిలియనీర్లు సొంత దేశం వదిలి మరో దేశానికి తరలివెళ్లే అవకాశం ఉందని నివేదిక అభిప్రాయపడింది. 2026 నాటికి ఈ సంఖ్య 1,65,000కి పెరగవచ్చని అంచనా. మరోవైపు ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 9,800 మంది మిలియనీర్లు యూఏఈకి వెళ్లే సంకేతాలు కనిపిస్తుండటంతో, ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నులను ఆకర్షించే దేశంగా యూఏఈ అగ్రస్థానంలో కొనసాగనుంది. గతేడాది వివిధ దేశాల నుంచి యూఏఈకి 6,700 మంది మిలియనీర్లు వెళ్లారు. ఆ తర్వాత యూఎస్ఏ, ఇటలీ, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియా మిలియనీర్లకు ఇష్టమైన దేశాలుగా ఉన్నాయి.

Next Story