- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Microsoft: ఏఐ కారణంగా రికార్డు స్థాయిలో పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల జీతం
ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం కంటే 22 శాతం అధికం కావడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారీగా జీతం తీసుకున్నారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్న దాని ప్రకారం, 2024-25లో సత్య నాదెళ్ల సంస్థ నుంచి ఏకంగా 96.5 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 847 కోట్లు) జీతం రూపంలో అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న మొత్తం కంటే 22 శాతం అధికం కావడం గమనార్హం. అంతేకాకుండా ఆయన సంస్థ కీలక పదవిని చేపట్టిన దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో కంపెనీ సాధించిన పురోగతి ఈ పెరుగుదలకు కారణమని బోర్డు చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. సత్య నాదెళ్ల, ఆయన టీమ్ జనరేషనల్ టెక్నాలజీ మార్పునకు మైక్రోసాఫ్ట్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లీడర్‌గా నిలబెట్టాయని కంపెనీ బోర్డు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ గణనీయమైన వృద్ధిని సాధించింది. దీనివల్ల కంపెనీ షేర్లు కూడా 20 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. కంపెనీకి అందించిన సేవలను గుర్తించి సత్య నాదెళ్లకు 9.5 మిలియన్ డాలర్లు(రూ. 83 కోట్లు) నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
ఓపెన్ఏఐపై బెట్టింగ్
సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ అప్పటికి అంతగా తెలియని ఏఐ స్టార్టప్ ఓపెన్ఏఐలో 1 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఓపెన్ఏఐ అప్పటి నుంచి ఏఐ రంగంలో ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అదనంగా మరో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంది. అప్పటినుంచి దాదాపు అన్ని ఉత్పత్తులు, సేవలలో ఏఐ ఫీచర్స్‌ను అందిస్తోంది. ఈ విషయంలో సత్య నాదెళ్ల చొరవ కారణంగా మైక్రోసాఫ్ట్ ఏఐలో ముందంజలో ఉంది.






