Meta: కొత్త వివాదంలో మెటా

by S Gopi |

కేవలం స్కామ్ యాడ్స్ నుంచే మెటా ప్రతి సంవత్సరం సుమారు 7 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు వివరించింది.

Meta: కొత్త వివాదంలో మెటా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంస్థ మెటా కొత్త వివాదంలో చిక్కుకుంది. గతేడాదిలో కంపెనీ మొత్తం ఆదాయంలో దాదాపు 10 శాతం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి యాప్‌లలో స్కామ్‌లు, నిషేధిత వస్తువులు, మోసపూరిత కంటెంట్‌తో సంబంధం ఉన్న యాడ్స్ నుంచి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ మేరకు కంపెనీ అంతర్గత డాక్యుమెంట్లలో పొందుపర్చినట్టు రాయిట్స్ కథనం పేర్కొంది. 2024, డిసెంబర్ నాటి డాక్యుమెంట్‌లో మెటా తన ప్లాట్‌ఫామ్‌లు ప్రతిరోజూ 15 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 1.33 లక్షల కోట్లు) 'అధిక రిస్క్' స్కామ్ యాడ్స్‌ను చూపిస్తుంది. అవి మోసపూరితమైనవని స్పష్టంగా ఉంటాయి. కేవలం ఇలాంటి స్కామ్ యాడ్స్ నుంచే మెటా ప్రతి సంవత్సరం సుమారు 7 బిలియన్ డాలర్ల(రూ. 62 వేల కోట్లకు పైనే) వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టు వివరించింది.

ఇదే సమయంలో మెటా ఇంటర్నల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిస్టమ్స్ అనుమానిత స్కామ్ యాడ్స్‌తో ఎలా వ్యవహరించాయనే విషయాలు కూడా ఈ డాక్యుమెంట్లలో ఉన్నాయి. చాలా ఎక్కువ రిస్క్ (95 శాతం లేదా అంతకంటే ఎక్కువ మోసం జరిగే అవకాశం) ఉన్న యాడ్స్‌ను మెటా పూర్తిగా నిషేధిస్తుంది. కానీ, అంతకంటే తక్కువగా ఉంటే, సదరు యాడ్స్‌ను ప్లాట్‌ఫామ్‌లో కొనసాగేందుకు అనుమతి ఉంటుంది. వాటికి అధిక ఛార్జీలను మెటా వసూలు చేస్తుంది.

2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 13.4 కోట్లకు పైగా స్కామ్ ప్రకటనలను తొలగించామని, గత 18 నెలల్లో స్కామ్ యాడ్స్‌పై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు 58 శాతం తగ్గించామని కంపెనీ చెబుతోంది. ఇదే సమయంలో స్కామ్, నిషేధిత ప్రకటనల నుంచి వచ్చే ఆదాయంలో వాటాను 2024లో 10.1 శాతం నుంచి 2025 చివరి నాటికి దాదాపు 7.3 శాతానికి, ఆపై 2026లో 6 శాతానికి, 2027 నాటికి 5.8 శాతానికి తగ్గించే లక్ష్యాకు నిర్దేశించినట్టు మెటా వెల్లడించింది.

Next Story