Meta Platforms: మెటా ఇండియా హెడ్‌గా అరుణ్ శ్రీనివాస్‌ నియామకం

by S Gopi |   (  Updated:2025-06-16 14:54:52  IST  )

అరుణ్ శ్రీనివాస్ జూలై 1వ తేదీ నుంచి బాధ్యతలను తీసుకోనున్నారు.

Meta Platforms: మెటా ఇండియా హెడ్‌గా అరుణ్ శ్రీనివాస్‌ నియామకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృసంస్థ మెటా ఇండియా విభాగానికి హెడ్‌గా అరుణ్ శ్రీనివాస్‌ను నియమిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను కూడా అరుణ్ శ్రీనివాస్ నిర్వహించనున్నారు. దీర్ఘకాలంలో మెటా వ్యాపారాల వృద్ధికి, సమర్థవంతంగా సంస్థ కార్యకలాపాలు నిర్వహించేందుకు అరుణ్ శ్రీనివాస్ నియామకం ఉపకరిస్తుందని మెటా ప్లాట్‌ఫామ్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వ్యాపారం, ఆవిష్కరణలు, ఆదాయం, క్లయింట్ సర్వీసెస్‌పై దృష్టి సారిస్తారని పేర్కొంది. 2020లో సంస్థలో చేరిన ఆయన, ప్రస్తుతం ఇండియా యాడ్స్ బిజినెస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అరుణ్ శ్రీనివాస్ జూలై 1వ తేదీ నుంచి బాధ్యతలను తీసుకోనున్నారు. లింక్‌డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 1993లో మద్రా యూనివర్శిటీ నుంచి డిగ్రీ, 1996లో ఐఐఎం కోల్‌కతాలో మార్కెటింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయెట్ చేసిన అరుణ్ శ్రీనివాస్ గతంలో హిందూస్తాన్ యూనిలీవర్, ఓలా, రీబాక్, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్ కేపిటల్ కంపెనీల్లో వివిధ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. దేశవ్యాప్తంగా అతిపెద్ద యాడ్ ఏజెన్సీలతో భాగస్వామ్యం ద్వారా మెటా అభివృద్ధిలో అరుణ్ శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారు. ఏఐ, రీల్స్, మెసేజింగ్ విభాగాల్లో ఆదాయం పెరిగేందుకు కృషి చేశారు.

Next Story