ఈ ఏడాదిలోనూ రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యం: మెర్సిడెస్ బెంజ్!

by Disha Web Desk 14 |
ఈ ఏడాదిలోనూ రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యం: మెర్సిడెస్ బెంజ్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలోనూ భారత వాహన పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉండనుందని లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, గతేడాది తరహాలోనే మెరుగైన అమ్మకాలను సాధించగలమని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇదే సమయంలో 2023లో కంపెనీ పది కొత్త మోడళ్లను విడుదల చేయాలని భావించింది. అయితే, సరఫరా సమస్యల కారణంగా కొన్ని కార్ల లాంచ్‌లు ఆలస్యమయ్యాయని, ఈ ఏడాది రెండు, మూడవ త్రైమాసికంలో వాటిని తీసుకొస్తామని కంపెనీ ఇండియా సీఈఓ, ఎండీ సంతోష్ అయ్యర్ అన్నారు.

అయితే, ఇప్పటికీ భారత వాహన మార్కెట్ ఇతర దేశాల కంటే అధిక సామర్థ్యాన్ని, సానుకూలతను కలిగి ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది కూడా భారత్‌లో రెండంకెల వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉన్నామని, అధిక వడ్డీ రేట్లు, సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ లక్ష్యాన్ని చేరుకోగలాని సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ 2021లో 11,242 యూనిట్లను విక్రయించగా, 2022 చివరి నాటికి రికార్డు స్థాయిలో 15,822 కార్లతో 41 శాతం వృద్ధిని చూసింది. ఇది కరోనా ముందు 2018లో అమ్ముడైన 15,583 కంటే ఎక్కువ కావడం గమనార్హం.


Next Story