- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mehul Choksi: బెల్జియంలో పీఎన్‌బీ స్కామ్ మోసగాడు మేహుల్ చోక్సీ అరెస్ట్
మన దేశ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం ఉదయం భారత అధికారులు ఈ వార్తను ధృవీకరించారు

దిశ, బిజినెస్ బ్యూరో: రూ. 13,850 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) స్కామ్ చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని శనివారం బెల్జియంలో స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది. 2018లో ఈ స్కామ్ బయటపడగా, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మేహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోడీ దేశం వదిలి పారిపోయారు. వారిద్దరినీ స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల మేహుల్ చోక్సీ బెల్జియంలో ఉన్నట్టు తెలియడంతో, అక్కడి ప్రభుత్వంతో సంప్రదించింది. తాజాగా బెల్జియం పోలీసులు మేహుల్ చోక్సీని అరెస్ట్ చేశారు. మన దేశ దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం ఉదయం భారత అధికారులు ఈ వార్తను ధృవీకరించారు. తదుపరి అప్పగింత ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సమాచారం. 2018, మే 23, 2021, జూన్ 15 తేదీలలో ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్‌ల ఆధారంగా పోలీసులు మెహుల్ చోక్సీని కస్టడీలోకి తీసుకున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, అనారోగ్య కారణాలతో మేహుల్ చోక్సీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈడీతో పాటు సీబీఐ అధికారులు మేహుల్ చోక్సీ అప్పగింత ప్రక్రియ కోసం బెల్జియం ప్రభుత్వాన్ని కోరనున్నాయి.
మేహుల్ చోక్సీ అరెస్ట్ అవడంతో, ఏడేళ్లుగా అనేక అడ్డంకుల మధ్య మూడు దేశాల్లో నిరంతరాయంగా వెతుకులాట సాగించిన భారతీయ దర్యాప్తు సంస్థలకు ఇది ఉపశమనం కలిగించే విషయం. పెట్టుబడుల సొమ్ముతో తొలుత పౌరసత్వం తీసుకున్న అతను ఆంటిగ్వాకు వెళ్లాడు. ఆ తర్వాత 2021లో డొమినికన్ రిపబ్లిక్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడనే కారణంతో చోక్సీని అరెస్టు చేశారు. అతని కస్టడీ కోసం కరేబియన్ దేశానికి వెళ్లిన సీబీఐ బృందానికి నిరాశే ఎదురైంది. చోక్సీ తరపు న్యాయవాదులు డొమినికన్ కోర్టులో.. చికిత్స కోసం ఆంటిగ్వాకు వెళ్లాసి ఉందని, తర్వాత విచారణను ఎదుర్కొంటానని హామీ ఇచ్చారు. 51 రోజుల జైలు జీవితం తర్వాత, బ్రిటిష్ క్వీన్స్ ప్రివీ కౌన్సిల్ నుంచి ఉపశమనం లభించడంతో చోక్సీ అప్పగింత ప్రక్రియ నుంచి తప్పించుకున్నాడు.
సీబీ, ఈడీ ఆ సమయంలో అతడిని ట్రాక్ చేశాయి. గతేడాది బెల్జియం వెళ్లాడని తెలుసుకున్న తర్వాత అక్కడి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాయి. పీఎన్‌బీ స్కామ్ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను సమర్పించి అరెస్టుకు అనుమతులు పొందాయి. ఈ నేపథ్యంలోని గత శనివారం అక్కడి పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. నిజానికి మేహుల్ చోక్సీ స్విట్జర్లాండ్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మేహుల్ చోక్సీ భార్య ప్రీతీ చోక్సీ బెల్జియం పౌరురాలు. ఈ కారణంగా 2023, నవంబర్‌లో అతడికి ఎఫ్ రెసిడెన్సీ కార్డు లభించింది. ఈ కార్డు ద్వారా షరతుల కింద లైఫ్ పార్ట్‌నర్‌తో కలిసి బెల్జియంలో చట్టబద్ధంగా ఉండొచ్చు. దీనికోసం కూడా చోక్సీ నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది.






