Apple: యాపిల్ కొత్త సీఓఓగా భారత సంతతి వ్యక్తి

by S Gopi |   (  Updated:2025-07-09 12:55:20  IST  )

ఈ నెలాఖరులో సబీ ఖాన్ బాధ్యతలను చేపడతారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

Apple: యాపిల్ కొత్త సీఓఓగా భారత సంతతి వ్యక్తి
X

దిశ, బిజినెస్: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీలోని కీలక నాయకత్వ బాధ్యతల్లో మార్పులు చేసింది. తాజాగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) గా భారత మూలాలున్న సబీ ఖాన్ కు బాధ్యతలు అప్పగించింది. 30 ఏళ్లుగా యాపిల్‌లో పనిచేస్తున్న సబీ ఖాన్, ప్రస్తుతం సీఓఓగా ఉన్న జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ నెలాఖరులో సబీ ఖాన్ బాధ్యతలను చేపడతారని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం సబీ ఖాన్ ఆపరేషన్స్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూనే కంపెనీలో కీలకమైన గ్లోబల్ సప్లై చైన్‌ ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు.

సబీ ఖాన్ గురించి

1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించిన సబీ ఖాన్.. స్కూల్ విద్య సింగపూర్‌ లో, ఆ తర్వాత ఉన్నత చదువులు అమెరికాలో పూర్తిచేశారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన, 1995లో యాపిల్‌లో చేరారు. అంతకుముందు జీఈ ప్లాస్టిక్స్ లో కొన్నాళ్లు పనిచేశారు. భారత్‌ను కీలక మార్కెట్‌గానే కాకుండా, తయారీ కేంద్రంగా మార్చాలని యాపిల్ భావిస్తున్న తరుణంలో ఆయన నియామకం ఆసక్తికరం.

టిమ్ కుక్ ప్రశంసలు

సబీ ఖాన్‌ ప్రమోషన్ గురించి స్పందించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సబీ ఖాన్ కంపెనీ వృద్ధిలో ముఖ్యమైన వ్యూహకర్త. యాపిల్ సప్లై చైన్ రూపకల్పనలో ఆయన పాత్ర చాలా కీలకం. టెక్నాలజీ పరంగా అత్యాధునిక తయారీ వ్యూహాలను అభివృద్ధి చేయడంలో, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన ముందున్నారు' అని ప్రశంసించారు.

Next Story