Maruti Suzuki: చిన్న కారు 'ఇగ్నిస్' ఉత్పత్తి నిలిపేసిన మారుతీ సుజుకి

by S Gopi |

ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్లోనూ ఈ కార్డు కనిపించడంలేదు, డీలర్లు సైతం కొత్త బుకింగ్‌లను తీసుకోవట్లేదు.

Maruti Suzuki: చిన్న కారు ఇగ్నిస్ ఉత్పత్తి నిలిపేసిన మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి తన బడ్జెట్ మోడల్ 'ఇగ్నిస్' ఉత్పత్తిని నిలిపేసినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా అమ్మకాలు పడిపోవడం, డిమాండ్ క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నెల రోజుల నుంచే ఈ కారు ఉత్పత్తి ఆగిపోయిందని డీలర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్లోనూ ఈ కార్డు కనిపించడంలేదు, డీలర్లు సైతం కొత్త బుకింగ్‌లను తీసుకోవట్లేదు. తొలిసారిగా 2017లో విడుదలైన ఈ ప్రీమియం అర్బన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు ధర రూ. 4.59 లక్షల నుంచి రూ. 7.80 లక్షల మధ్య ఉండేది. ప్రధానంగా యువత, పట్టణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ రూపొందించింది. గతేడాది ఆఖరులో కేంద్రం జీఎస్టీ తగ్గింపు తర్వాత కారు ధర రూ. 71 వేల వరకు తగ్గినప్పటికీ, అమ్మకాల్లో ఆ జోరు కనిపించలేదు. అయితే, కంపెనీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో చిన్న కార్ల సెగ్మెంట్లో దూకుడుగా ఉన్న టాటా పంచ్, హ్యూండాయ్ ఎక్స్‌టర్ మోడళ్లకు పోటీగా మైక్రో ఎస్‌యూవీ విభాగంలో కొత్త మోడల్‌ను విడుదల చేయవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story