Makemytrip: రైల్లో సీట్ల వద్దకే ఫుడ్ డెలివరీ సేవలు

by S Gopi |

మేక్‌మైట్రిప్ యాప్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Makemytrip: రైల్లో సీట్ల వద్దకే ఫుడ్ డెలివరీ సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ఏజెన్సీ మేక్‌మైట్రిప్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలిసి 'ఫుడ్ ఆన్ ట్రైన్' ఆఫర్ కింద ఇప్పుడు 130కి పైగా స్టేషన్లలో ఫుడ్ డెలివరీ సేవలను అందించనున్నాయి. మేక్‌మైట్రిప్ యాప్‌లో రైలు టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు ఈ సదుపాయం లభిస్తుంది. 'లైవ్ ట్రైన్ స్టేటస్' టూల్‌ను ఉపయోగించడం ద్వారా 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అందిస్తామని, టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ వంటి సేవలందిస్తామని మేక్‌మైట్రిప్ బుధవారం ఒప్పందం సందర్భంగా వెల్లడించింది. మేక్‌మైట్రిప్ యాప్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు తమ ప్రయాణంలో ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. జొమాటోతో భాగస్వామ్యం ద్వారా మరింత మెరుగైన సేవలను అందిస్తాం. మొబిలిటీ ఎకోసిస్టమ్‌లో వేగవంతమైన వినియోగ సేవలకు అవకాశం ఉంటుందని మేక్‌మైట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజ్ రిషి సింగ్ అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రోజుకు 90 వేల కంటే ఎక్కువ మంది రైల్వే ప్రయాణికులు ఇండియన్ రైల్వేస్ ఈ-క్యాటరింగ్ సేవలను ఉపయోగించారు. ఇది అంతకుముందు ఏడాది కంటే 66 శాతం పెరిగింది. రైలు ప్రయాణికులు మేక్‌మైట్రిప్ ప్లాట్‌ఫామ్ నుంచి తమకు నచ్చిన రెస్టారెంట్ భోజనాన్ని ఆర్డర్ చేసుకునే వీలుంటుంది. ఆర్డర్ పొందినవారికి నేరుగా తమ సీట్ల వద్దకే డెలివరీ అందుతుంది. దీని ద్వారా తమ కస్టమర్లకు శ్రమలేకుండా సేవలందించే అవకాశం లభించడం సంతోషంగా ఉందని జొమాటో వైస్-ప్రెసిడెంట్ రాహుల్ గుప్తా పేర్కొన్నారు.

Next Story