M&M: రెండేళ్లలో 250 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: మహీంద్రా & మహీంద్రా

by S Gopi |

దీన్ని మరింత పెంచేందుకు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది.

M&M: రెండేళ్లలో 250 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: మహీంద్రా & మహీంద్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించింది. 2027 నాటికి 180 కిలోవాట్ సామర్థ్యం కలిగిన 250 ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని మంగళవారం ప్రకటనలో తెలిపింది. దేశంలో ఈవీల గిరాకీ అత్యంత వేగంగా పెరుగుతోంది. దీన్ని మరింత పెంచేందుకు పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. అందుకనుగుణంగానే 250 స్టేషన్లలో 1,000 ఛార్జింగ్ పాయింట్లతో బలమైన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ కలిగి ఉండేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే తాము బెంగళూరు-చెన్నై హైవే ఎన్‌హెచ్75లోని హోస్కోట్, ఎన్‌హెచ్44లో ఢిల్లీ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ముర్తల్ వద్ద ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించామని కంపెనీ పేర్కొంది. కంపెనీ తన ఛార్జ్-ఇన్ ఆల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా అందరూ ఈవీ కస్టమర్ల కోసం ఓపెన్, యాక్సెస్ నెట్‌వర్క్ అందిస్తామని కంపెనీ సీఈఓ నళినీ కాంత్ గొల్లగుంట చెప్పారు. ప్రతి ఛార్జింగ్ స్టేషన్ రెస్టారెంట్లు, కేఫ్‌లు వంటి ప్రదేశాలకు చేరువలో ఉండేలా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story