SEBI: సెబీ మాజీ చీఫ్ మాధవి బుచ్‌కు లోక్‌పాల్ క్లీన్‌చిట్

by S Gopi |

జస్టిస్ ఎ ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై ఉత్తర్వులు

SEBI: సెబీ మాజీ చీఫ్ మాధవి బుచ్‌కు లోక్‌పాల్ క్లీన్‌చిట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక మన మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్‌పర్సన్ మాధవి పూరి బుచ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా ఆమెకు భారీ ఊరట లభించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల విషయంలో అవినీతి నిరోధక సంస్థ లోక్‌పాల్ ఆమెకు క్లీన్‌చిట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి అన్ని ఫిర్యాదులను భారత లోక్‌పాల్ తోసిపుచ్చింది. జస్టిస్ ఎ ఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం దీనిపై ఉత్తర్వులిస్తూ.. ఆరోపణలను బలపరిచే స్థాయిలో, దర్యాప్తుకు చేపట్టేందుకు కావాల్సిన ఆధారాలు ఏవీ లేవని స్పష్టం చేసింది. మాధవి పూరి బుచ్‌పై వచ్చిన ఆరోపణలన్నీ ఊహాజనితం, రాజకీయ ఉద్దేశంతో వచ్చినవేనని పేర్కొంది. కాగా, గతేడాది హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువైన ఉద్దేశపూర్వకంగా పెంచడానికి వాడిన మార్షిస్ ఫండ్లలో మాధవి పూరితో పాటు ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని ఆరోపణలు చేసింది. దీనిపై మాధవి పూరి, ఆమె భర్త స్పందించారు. సెబీ విశ్వసనీయతతో పాటు తమపై వ్యక్తిగత హననానికి హిండెన్‌బర్గ్ పాల్పడిందని అధికారిక ప్రకటనలో చెప్పారు. మరోవైపు అదానీ గ్రూప్ కూడా అవన్నీ నిరాధారమైనవని, దురుద్దేశంతో చేసిన ఆరోపణలని ఖండించింది.

Next Story